
హరితహారానికి సహకరించండి
ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలకు సీఎస్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ఇందులో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కోరారు. కార్యాలయాల ఆవరణలో భారీగా మొక్కలు నాటడ మే కాక గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు పెంచాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్) కింద కేటాయించాలని కోరారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో కలసి ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులతో రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్, సీసీఎం బీ, ఎన్‌ఐఎన్, బీడీఎల్, మిథాని, నిఫ్ట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్, టీఐఎస్‌ఎస్, సీడీఎఫ్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. హరితహారంలో పూర్తిస్థాయిలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు.