సగం తెగిన మెడతో కబేళా నుంచి తప్పించుకున్న ఎద్దు
'అంబా..' అని ఆర్తనాదం కూడా చేయలేని స్థితితో.. సగం తెగిపోయిన గంగడోలు(మెడ కింది భాగం)తో రోడ్డుపై నిల్చున్న మూగజీవిని ఆదరించి అక్కున చేర్చుకున్నాడో మానవతావాది. సోమవారం అర్ధరాత్రి నగరంలోని నాచారం పారిశ్రామిక ప్రాంతం పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ అనుమతితో నడుస్తోన్న కబేళాల్లో అర్ధరాత్రి ఎద్దులు, బర్రెలను కోసి ఉదయానికల్లా దుకాణాలకు మాసం సరఫరా చేస్తుంటారు నిర్వాహకులు. అలా సోమవారం రాత్రి నాచారంలోని కబేళాలో ఎద్దును కోసేందుకు ప్రయత్నించగా, అది తప్పించుకుని రోడ్డుపైకి వచ్చేసింది. రక్తం ధారలా కారిపోతూ తెగిన మెడతో దీనంగా నిల్చున్న ఎద్దును శివప్రకాశ్ అనే వ్యక్తి గుర్తించాడు. వెంటనే ఆ ఎద్దును తన ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశాడు.
మంగళవారం పొద్దున్నే ఎద్దును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మూగజీవి పూర్తిగా కోలుకున్న తర్వాత మేడ్చల్‌లోని గోశాలకు దానిని అప్పగిస్తానని ప్రకాశ్ తెలిపారు. ఆపదలో ఉన్న మనుషులను సాటి మనుషులే ఆదుకోలేకపోతోన్న నేటికాలంలో మూగజీవాన్ని ఆదరించిన ప్రకాశ్ ను పలువురు అభినందించారు.