ముందు తాగిస్తాడు.. తర్వాత దోచేస్తాడు
♦ జ్యువెలరీ దొంగను అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు
♦ గతంలో రైతులను కూడా మోసం చేసిన చిన్నారెడ్డి
♦ వివరాలు వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చూసేందుకు జెంటిల్‌మన్ వేషధారణ.. చేతిలో నగదు కట్టలు ఉన్నట్టుగా భ్రమింపజేసే ఓ బ్యాగ్.. మార్కెట్‌కు వచ్చే జ్యువెలరీ షాప్ ఉద్యోగులు.. రైతులను లక్ష్యంగా చేసుకుని చోరీలు.. ఇదీ ఆ జ్యువెలరీ దొంగ తీరు. దర్జాగా డ్రెస్ చేసుకుని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తిలా హడావుడి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని బాధితులతో పరిచయం పెంచుకుంటాడు. వారికున్న మద్యం తాగే అలవాటును ఆసరాగా చేసుకుని పీకలదాకా తాగిస్తాడు.
ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల సంచిని, డ బ్బుల్ని చోరీ చేసి ఉడాయిస్తాడు. ఈ రకమైన చోరీలు చేసిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డిని మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంటనగరాల్లోని జ్యువెలరీ షాప్‌ల నుంచి కొనుగోలు చేసిన 2.3 కిలోల బంగారు ఆభరణాలను తీసుకొస్తున్న తన డ్రైవర్ ప్రశాంత్‌కు పీకలదాకా మద్యం తాగించి ఓ వ్యక్తి తస్కరించుకుని పోయాడని వరంగల్‌కు చెందిన నగల వ్యాపారి బొల్లామ్ సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు.
సీసీటీవీ ఆధారంగా...
బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలిని సందర్శించిన విచారణ బృందం ఆయా మార్గాల్లోని కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాలను సేకరించింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు... జనగామ్, వరంగల్, అచ్చంపేట, తిరుపతి, ఆర్మూర్, నిజామాబాద్‌కు బృందాలను పంపించారు. చివరకు నిజామాబాద్ జిల్లాలోని ముబారక్‌నగర్‌లోని లక్ష్మీప్రియానగర్ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టుకున్నాయి. నిందితుడి నుంచి మార్కెట్ ఠాణాలో చోరీకి గురైన 2.4 కిలోల బంగారం, తులం రింగ్, గోపాలపురం ఠాణా పరిధిలో దొంగలించిన 10 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో పాటు కరీంనగర్ గోదావరిఖనిలో చోరీ చేసిన 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లలో 13 చోరీలు చేసినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసిన బృంద సభ్యులందరినీ రివార్డులతో సీపీ సన్మానించారు.