DCP Prakash Reddy
-
'ఆ బాంబు బెదిరింపు నకిలీయే'
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. సాయిరాం కాలేరు అనే పేరుతో ఒక అగంతకుడు మెయిల్ రూపంలో అధికారులకు పంపిన విషయం విదితమే . కాగా, ఈ బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్‌గా గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం ప్రెస్మీట్లో పేర్కొన్నారు. డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయిరాం, శశికాంత్ ఇద్దరు మంచి స్నేహితులు. కాగా, సాయిరాం గత కొన్ని రోజులుగా కెనడా వెళ్లే పనిలో వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయిరాం వీసా అప్లికేషన్ దరఖాస్తు చేయడం కోసం శశికాంత్ ఇంటికి వెళ్లాడు. అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలను సాయిరాం కంప్యూటర్లో అప్లోడ్ చేస్తుండగా శశికాంత్ ఆ వివరాలను రహస్యంగా సేకరించినట్లు తెలిపారు. సాయిరాం పేరుతో అసభ్య పదజాలంతో కూడిన సమాచారాన్ని శశికాంత్ కెనడా వీసా సైట్లో అప్లోడ్ చేయడాన్ని తెలుసుకున్న సాయిరాం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు ఇచ్చాడన్న కోపంతో ఎలాగైనా సాయిరాంను కెనెడా వెళ్లకుండా అడ్డుకోవాలని శశికాంత్ విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే 4వ తేదిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాయిరాం కెనడాకు వెళ్తున్నట్లు తెలుసుకున్న శశికాంత్ సాయిరాం మెయిల్ ఐడీతో ఎయిర్‌పోర్ట్‌ను బ్లాస్ట్ చేయనున్నట్లు మెయిల్ రూపంలో అధికారులకు పంపినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనకు సూత్రధారుడైన శశికాంత్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. (చదవండి : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు) -
ఏటీఎం దొంగలు దొరికారు
సాక్షి, మొయినాబాద్ : జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాగా ఏర్పడి ఈజీగా మనీ సంపాదించాలని దొంగతనాన్ని ఎంచుకున్నారు. ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా ఇరవై రోజుల వ్యవధిలో మొయినాబాద్, నార్సింగి, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించి విఫలమయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సోమవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ సర్ఫరాజ్, మహ్మద్ అమీర్ రయీస్, అబ్దుల్ రహీం, మొయినాబాద్ మండలం ముర్తూజగూడ గ్రామానికి చెందిన మహ్మద్ ఫర్దీన్ స్నేహితులు. వీరిలో మహ్మద్ సర్ఫరాజ్ ఇంటర్ చదువుతుండగా మిగిలిన వారు ఇంటర్ వరకు చదివి ప్రైవేటు కంపెనీల్లో పనులు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఈ నలుగురు యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రాల్లో చొరబడి మిషన్‌ను ధ్వంసం చేసి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేశారు. అర్ధరాత్రి చోరీలు... ముఠాగా ఏర్పడిన ఈ నలుగురు యువకులు ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా చోరీలు మొదలుపెట్టారు. జూన్ 27 అర్ధరాత్రి 2 గంటల సమయంలో మొయినాబాద్‌లో అంజనాదేవి గార్డెన్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్ ఎదుట ఉన్న సీసీ కెమరాలు ధ్వంసం చేసి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని డబ్బు తీసేందుకు ప్రయత్నించారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఉన్న బాక్స్ తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నం విఫలమైంది. అదే విధంగా జులై 11న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మొయినాబాద్ మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న యాక్సీస్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించారు. మనీ బాక్సు తెరుచుకోకపోవడంతో అక్కడ కూడా వారికి డబ్బులేమీ దొరకలేదు. అన్ని చోట్ల విఫలమే... మొయినాబాద్ మండలంలోని రెండు ఏటీఎం సెంటర్లతో పాటు 20 రోజుల వ్యవధిలో నార్సింగి పీఎస్ పరిధిలో మూడు చోట్ల, రాయదుర్గం పీఎస్ పరిధిలో ఒక చోట ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించారు. ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు యత్నించిన దుండగులు అన్ని చోట్ల విఫలమయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుబడ్డారు ఏటీఎం సెంటర్లలో చోరీలకు యత్నించిన ముఠాను పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించారు. నిందితులు ఎక్కడ ఏటీఎం సెంటర్లో చోరీకి యత్నించినా.. అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే నిందితులు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చే దృశ్యాలు అప్పటికే నిక్షిప్తమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. సోమవారం మొయినాబాద్ మండలంలోని జేబీఐటీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వస్తున్న ముగ్గురు నిందితులు మహ్మద్ సర్ఫరాజ్, మహ్మద్ అమీర్ రయీస్, మహ్మద్ ఫర్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్‌తో పాటు ఒక టూల్ కిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రియాండ్‌కు తరలించారు. కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన మొయినాబాద్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్, కానిస్టేబుళ్లను డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఏసీపీ అశోక చక్రవర్తి అభినందించారు. -
పంచాయితీ ఎన్నికలకు కట్టుదుట్టమైన ఏర్పాట్లు చేశాం
-
ఎల్బీనగర్లో కార్డన్ సెర్చ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న సాయినగర్‌లో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, అలాగే 25 బైక్‌లు, 70 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
ముందు తాగిస్తాడు.. తర్వాత దోచేస్తాడు
♦ జ్యువెలరీ దొంగను అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు ♦ గతంలో రైతులను కూడా మోసం చేసిన చిన్నారెడ్డి ♦ వివరాలు వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: చూసేందుకు జెంటిల్మన్ వేషధారణ.. చేతిలో నగదు కట్టలు ఉన్నట్టుగా భ్రమింపజేసే ఓ బ్యాగ్.. మార్కెట్‌కు వచ్చే జ్యువెలరీ షాప్ ఉద్యోగులు.. రైతులను లక్ష్యంగా చేసుకుని చోరీలు.. ఇదీ ఆ జ్యువెలరీ దొంగ తీరు. దర్జాగా డ్రెస్ చేసుకుని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తిలా హడావుడి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని బాధితులతో పరిచయం పెంచుకుంటాడు. వారికున్న మద్యం తాగే అలవాటును ఆసరాగా చేసుకుని పీకలదాకా తాగిస్తాడు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల సంచిని, డ బ్బుల్ని చోరీ చేసి ఉడాయిస్తాడు. ఈ రకమైన చోరీలు చేసిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డిని మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంటనగరాల్లోని జ్యువెలరీ షాప్‌ల నుంచి కొనుగోలు చేసిన 2.3 కిలోల బంగారు ఆభరణాలను తీసుకొస్తున్న తన డ్రైవర్ ప్రశాంత్‌కు పీకలదాకా మద్యం తాగించి ఓ వ్యక్తి తస్కరించుకుని పోయాడని వరంగల్‌కు చెందిన నగల వ్యాపారి బొల్లామ్ సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా... బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలిని సందర్శించిన విచారణ బృందం ఆయా మార్గాల్లోని కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాలను సేకరించింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు... జనగామ్, వరంగల్, అచ్చంపేట, తిరుపతి, ఆర్మూర్, నిజామాబాద్‌కు బృందాలను పంపించారు. చివరకు నిజామాబాద్ జిల్లాలోని ముబారక్‌నగర్‌లోని లక్ష్మీప్రియానగర్ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టుకున్నాయి. నిందితుడి నుంచి మార్కెట్ ఠాణాలో చోరీకి గురైన 2.4 కిలోల బంగారం, తులం రింగ్, గోపాలపురం ఠాణా పరిధిలో దొంగలించిన 10 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో పాటు కరీంనగర్ గోదావరిఖనిలో చోరీ చేసిన 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లలో 13 చోరీలు చేసినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసిన బృంద సభ్యులందరినీ రివార్డులతో సీపీ సన్మానించారు.