నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు: సీపీఎం
హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం తీసుకున్న రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.
వనస్థలిపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నల్లధనాన్ని వెలికితీయడానికి, ఉగ్రవాదుల చర్యలను అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నాదన్నారు. రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న అనేక వాస్తవాలు చూస్తే బీజేపీ డొల్లతనం అర్థమవుతోందని చెప్పారు.
నోట్ల రద్దుతో అసలైన నల్లకుభేరులు దర్జాగా ఉండడం చూస్తే బీజేపీ తన అనుకూలదారులకు ముందే లీక్ చేసి ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని 100 రోజుల్లో వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేస్తామని బీజేపీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ ద్వంద నీతిని ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను చెరుపల్లి పంపిణీ చేశారు.