'అతడిని విడుదల చేస్తే మృగాన్ని వదిలినట్టే'
హైదరాబాద్: 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... రుణాల పేరుతో మహిళలను లైంగికంగా వేధించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ కేసులు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.
నిర్భయ కేసులో బాలనేరస్థుడిని జైలు నుంచి విడుదల చేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. అతడిని విడుదల చేస్తే సమాజంలోకి మృగాన్ని వదిలినట్టేనని వ్యాఖ్యానించారు. కాగా, బాలనేరస్థుడిని విడుదల చేయొద్దని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.