అన్న తిరుగొద్దన్నడు..! | Danam nagender warned to other politicians | Sakshi
Sakshi News home page

అన్న తిరుగొద్దన్నడు..!

Published Mon, Mar 10 2014 1:04 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

అన్న తిరుగొద్దన్నడు..! - Sakshi

అన్న తిరుగొద్దన్నడు..!

 బంజారాహిల్స్
‘ఈ బస్తీలో మా అన్నతిరుగొద్దన్నడు..మీరు వెంటనే వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు..’
ఇవీ ఏ వీధి రౌడీయో అన్న మాటలు కావు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఉద్దేశించి తాజా మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరుల హెచ్చరికలు. వద్దన్నా.. మీరు పర్యటిస్తారా.. అంటూ అనుచరులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగారు. పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి మీరెవరు.. అని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. సుమారు గంటపాటు దౌర్జన్యకాండ సాగినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించి చివరకు చర్యలు తీసుకునేలోపు అక్కడ్నుంచి జారుకున్నారు.
   

ఇదంతా బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్‌సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డి వెంకటేశ్వరనగర్‌లో పాదయాత్ర ప్రారంభించి గడపగడపకు పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలకగా యువత వందలాది సంఖ్యలో మద్దతుగా పాదయాత్ర చేస్తున్నారు.

ఇది జీర్ణించుకోలేని మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరులు, స్థానిక కార్పొరేటర్ బి.భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్జీ, రాజేందర్, సంజీవ్‌నాయక్, యాదమ్మ తదితరులు విజయారెడ్డి పాదయాత్రను అడ్డుకున్నారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని కార్పొరేటర్ కొడుకు హెచ్చరించాడు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజల వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరెవరని మహిళా నాయకురాలు అనిత ప్రశ్నించగా కార్పొరేటర్ కొడుకు, తమ్ముడు, అనుచరులు ఆమెపై దాడిచేసి గాయపర్చారు.

అడ్డొచ్చిన వారిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. సుమారు గంటపాటు దౌర్జన్యకాండ సాగడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు నచ్చజెబుతుండగానే కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులకు పనిచెప్పారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేలోపు కాంగ్రెస్ నాయకులు అక్కడ్నుంచి జారుకున్నారు.
 

కార్పొరేటర్ కొడుకు, తమ్ముడిపై కేసు నమోదు : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు,నేతలపై దాడులకు పాల్పడిన బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్జీ, అనుచరులు సంజీవ్‌నాయక్, రాజేందర్‌లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 (దౌర్జన్యం), సెక్షన్ 509 (మహిళలపై అసభ్యప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషించడం), 506 (చంపుతానని బెదిరించడం) తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా పరారీలో ఉన్నారని, గాలిస్తున్నట్లు అదనపు సీఐ నయీముల్లా తెలిపారు.
 అరెస్టు చేయాలంటూ విజయారెడ్డి ఆందోళన : ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తుంటే దౌర్జన్యంగా అడ్డుకోవడమే కాకుండా దాడికి పాల్పడిన తాజామాజీమంత్రి దానం నాగేందర్  అనుచరులు, కార్పొరేటర్ కొడుకు, తమ్ముడు, బంధువులను తక్షణం అరెస్టు చేయాలని విజయారెడ్డి డిమాండ్‌చేశారు.

అరెస్టు చేసేవరకు ఇక్కడ్నుంచి కదిలేదిలేదంటూ హెచ్చరించారు. తమ బ్యానర్లు చించేశారన్నారు. తన మంచితనంతో పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మారిస్తే..ఆయన పేరుతో గెలిచిన నాగేందర్ రౌడీల అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తేలేదని, ఎంత అణగదొక్కాలని చూస్తే తమ కార్యకర్తలు పులుల్లా వెంటబడి తరుముతారని విజయారెడ్డి దానం నాగేందర్‌ను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement