
సినీశిఖరం
►నగరం కేంద్రంగా దాసరి ప్రస్థానం
►సినీ పరిశ్రమకు ఊపిరిలూదింది ఇక్కడే
►చెన్నై టు సిటీకి ‘ఇండస్ట్రీ’ తరలింపులోనూ కీలక పాత్ర
►మృతితో శోకసంద్రమైన సినీ ప్రపంచం
మహోన్నత సినీ శిఖరం నేలకొరిగింది. తెలుగు సినిమా ‘ధృవనక్షత్రం’ అదృశ్యమైంది. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమాతోపాటు ఎన్నో ఏళ్లుగా నగరంతోనూ ఆయనది ఆత్మీయ అనుబంధం. చెన్నై నుంచి సిటీకి సినీ పరిశ్రమ తరలిరావడంలోనూ కీలకపాత్ర పోషించారు. అద్భుతమైన సినిమాలతో అలరించి.. దర్శకరత్నగా రాణించి..పరిశ్రమను బతికించేందుకు నిరంతరం శ్రమించి..సినీ కార్మికలోకంలో ధృవతారగా నిలిచిన దాసరి నారాయణరావుకు
భాగ్యనగరం ఘన నివాళులర్పిస్తోంది.
►దాసరి నారాయణరావు 90 శాతం సినిమాలను సిటీ కేంద్రంగానే రూపొందించారు.
► సినీ రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లోనూ ఆయన నిష్ణాతులే..
►దాసరి ఫిలిం యూనివర్సిటీని స్థాపించి ఎంతో మందికి శిక్షణ సైతం ఇచ్చారు.
►చెన్నైలో ఉన్న రోజుల్లో సిటీకి వచ్చిన ప్రతిసారి ఆయన నాంపల్లిలోని అన్నపూర్ణ హోటల్‌లో బస చేసేవారు.
►‘ఉదయం’ దినపత్రికను ప్రారంభించాక రాంనగర్‌లోని కార్యాలయంలోనే ఎక్కువ సమయం గడిపేవారు.
►దాసరి నిర్మించిన సినిమాల్లో 80 శాతం శతదినోత్సవాలు జరుపుకొన్నాయి.
►మొట్టమొదటి సినిమా ‘తాతా మనవడు’ సంగం థియేటర్‌లో 365 రోజులాడింది.
►‘ప్రేమాభిషేకం’ సినిమా సుదర్శన్ 35 ఎంఎంలో 525 రోజులాడింది.