బ్యారేజీలపై ‘మహా’ ఒప్పందాలు | Deals on barrages | Sakshi
Sakshi News home page

బ్యారేజీలపై ‘మహా’ ఒప్పందాలు

Published Thu, Mar 3 2016 3:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

బ్యారేజీలపై ‘మహా’ ఒప్పందాలు - Sakshi

బ్యారేజీలపై ‘మహా’ ఒప్పందాలు

ఛనాఖా-కొరట, తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులకు మహారాష్ట్ర ఓకే
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీరిచ్చేందుకు తోడ్పడే ఐదు ప్రధాన బ్యారేజీల నిర్మాణాలపై మహారాష్ట్రతో కీలక ఒప్పందాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన ఈ అంతర్రాష్ట్ర ఒప్పందాలపై తెలంగాణ, మహారాష్ట్రల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్ సంతకాలు చేయనున్నారు. గోదావరి ఉపనది అయిన పెన్‌గంగ డ్యామ్ దిగువన నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట, రాజాపేట, పిన్‌పహాడ్‌లతో పాటు ప్రాణహితపై ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించే తుమ్మిడిహెట్టి, గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీల నిర్మాణాలపై ఒప్పందాలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. ఇరు రాష్ట్రాల రైతులకు మేలు చే కూర్చేలా ప్రాజెక్టులు కట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫడ్నవిస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆహ్వానం మేరకు ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ముంబై వెళ్లనున్నారు. 8వ తేదీన ఒప్పందాలు జరుగనున్నాయి.

 ఏడాది చర్చల అనంతరం కొలిక్కి..
 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి, ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీలతో పాటు పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీలపై గతేడాది ఫిబ్రవరి 17న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తొలిసారిగా చర్చలు జరిగాయి. ముందుగా ఛనాఖా-కొరట మధ్య 1.5టీఎంసీల సామర్థ్యంగల బ్యారేజీకి మహారాష్ట్ర సమ్మతించింది. దాంతో ఈ బ్యారేజీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.368 కోట్లు విడుదలతో పాటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. ఇదే నదిపై రాజాపేట, పిన్‌పహాడ్ బ్యారేజీలను మహారాష్ట్ర నిర్మిస్తుండగా... వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.

ఇక తుమ్మిడిహెట్టి వద్ద ముంపు లేని బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీక రించింది. 148 మీటర్ల ఎత్తులో ముంపు లేనందున ఆ ఎత్తు తమకు సమ్మతమేనని స్పష్టం చేసింది. మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భాగంగా గోదావరి నదిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఎత్తులో 3వేల ఎకరాల వరకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే మహారాష్ట్రలోని గ్రామాల పరిధిలో ఎలాంటి ముంపు ఉండదని, నదీగర్భంలో మాత్రమే ఉంటుందని తెలంగాణచెప్పింది. దీనిపై సర్వే చేసిన మహారాష్ట్ర కూడా ముం పును నిర్ధారించుకుంది. అయితే తెలంగాణ చెప్పినట్లుగా 103మీటర్ల ఎత్తుకు ఒప్పుకొంటారా.. లేక 102 మీటర్లకో, 101 మీటర్లకో తగ్గించాలని కోరుతారా అనేదానిపై ఒప్పం దాల సమయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకట్రెండు మీటర్లు తగ్గినా తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు
 ఈ ఒప్పందాలతో రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు దక్కనున్నాయి. ఛనాఖా-కొరట ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 40వేల ఎకరాలు, తుమ్మిడిహెట్టితో ఇదే జిల్లాలో మరో 1.50 లక్షల ఎకరాలు, కాళేశ్వరంతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు  సాగు నీరు అందుతుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు మోక్షం లభించడం చారిత్రాత్మకమేనని నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement