‘డెత్‌’ స్పాట్‌.. డివై‘డర్‌’! | 'Death' spot .. divaidar '! | Sakshi
Sakshi News home page

‘డెత్‌’ స్పాట్‌.. డివై‘డర్‌’!

Published Sun, Jan 8 2017 11:26 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

‘డెత్‌’ స్పాట్‌.. డివై‘డర్‌’! - Sakshi

‘డెత్‌’ స్పాట్‌.. డివై‘డర్‌’!

రోడ్డు మధ్యలో మృత్యువు                
వారంలో  ఏడుగురు మృతి
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు        
డివైడర్ల నిర్మాణంలో    అశాస్త్రీయత..


నగరంలో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు నిర్మించిన డివైడర్లు దడ పుట్టిస్తున్నాయి. రోడ్డు మధ్యలో ప్రమాద హేతువులవుతున్నాయి. వీటిని ఢీకొని ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. డివైడర్ల  నిర్మాణంలో శాస్త్రీయత కొరవడడం, కనీస ప్రమాణాలు సైతం పాటించపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గత ఆదివారం నుంచి జరిగిన ఐదు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదం  ముగ్గురిని బలితీసుకోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో జరుగుతున్న ప్రమాదాల్లో 30 శాతం వీటివల్లేనని లెక్కతేలింది.

సిటీబ్యూరో:  జంట కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు వాహనదారుల పట్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు లెక్కతేల్చారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుజ్జునుజ్జు అవుతోంది. చోదకుడు సైతం ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువగా ఉంటోంది. గడిచిన కొన్నేళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు రాత్రి వేళ్లల్లో వాహనచోదకుల ప్రాణాలను హరిస్తున్నాయి.

కారణాలు అనేకం..
డివైడర్లు వాహనదారుల పాలిట మృత్యువుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం అదుపుతప్పి వాటిని ఢీకొంటున్నాయి. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచుగా ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మద్యం మత్తులో  దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. ఔటర్, ఇన్నర్‌ రింగ్‌రోడ్స్‌తో పాటు వాణిజ్య ప్రాంతాలు, కనెక్టివిటీ ప్రాంతాలుగా పరిగణించే కోఠి, అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారుల్లో తరచూ డివైడర్ల చోటు మారుతున్నాయి. వీటితోపాటు నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డివైడర్లు, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణనగర్, ఎస్సార్‌నగర్‌తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌ తదితర శివార్లలోని అనేక రహదారుల్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి.

డివైడర్ల నిర్మాణంలో తేడా..
సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాలి. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, లాలీపాప్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరితో డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్‌ మీడియమ్స్‌ వచ్చి చేరుతున్నాయి. వీటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.

కనిపించని ‘హెచ్చరిక’ బోర్డులు
ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో ‘హెచ్చరిక’ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్‌–1), 100 మీటర్ల వద్ద మరొకటి (కాషన్‌–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు మచ్చుకైనా కనిపించవు. ఈ డెత్‌ స్పాట్స్‌ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా ప్రమాద సూచికలు (హజార్డ్‌ మార్కర్స్‌) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్‌ మార్కర్స్‌ లేదా సోలార్‌ మార్కర్స్‌ పెట్టాలి. కానీ నగరంలో ఇవి మచ్చుకైనా కనిపించవు.

కలర్స్, క్యాట్‌ ఐస్‌ ఏర్పాటూ అంతంతే..
ప్రమాద హేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్‌ మార్జిన్స్‌లోనూ రిఫ్లెక్టివ్‌ పెయిటింగ్‌ వేయడం తప్పనిసరి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రిపూట మెరిసే క్యాట్‌ ఐస్‌ ఏర్పాటు చేయాలి. ఇవి వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంత మాత్రమే. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజినీరింగ్‌ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలి. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలి. ఈ చర్యలు తీసుకుంటేనే డివైడర్‌ ప్రమాదాలను అదుపు చేయవచ్చు.

వారం రోజుల్లో ప్రమాదాలు ఇలా..
ఈనెల 1న చందానగర్‌ పరిధిలో జరిగిన ప్రమాదంలో విష్ణుమూర్తి (32), కిరణ్‌కుమార్‌ (32) కన్నుమూశారు. రస్తారంగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇదేరోజు మేడిపల్లి ఠాణాపరిధిలో  జరిగిన యాక్సిడెం ట్‌లో ప్రవీణ్‌ఖంద్రా (26) చనిపోగా ప్రశాంత్‌ క్షతగాత్రుడయ్యాడు.
∙3వ తేదీ తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద జరిగిన ప్రమాదంలో వీరాస్వామి, యుగల్‌ క్షతగాత్రులయ్యారు. ఇదేరోజు మాదాపూర్‌ పరిధిలో జరిగిన ప్రమాదంలో రిత్‌రాజ్‌ (23), బులెటిన్‌రే (25) మరణించారు. ఆదివారం నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ఇంద్రారెడ్డి నగర్‌ కంచె వద్ద జరిగిన ప్రమాదంలో నారాయణ(60), సత్యవతి(55) ప్రాణాలు కోల్పోగా, భాస్కర్, భరత్, హారిక, మధు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement