సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత | Deer shot in HCU | Sakshi
Sakshi News home page

సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత

Published Mon, Jan 4 2016 7:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత - Sakshi

సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత

షూటింగ్ రేంజ్ కోచ్ తుపాకీతో కాల్చినట్లు అనుమానం
వర్సిటీలో జింక తల, మాంసం స్వాధీనం
పోలీసుల అదుపులో కోచ్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు
 
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) షూటింగ్ రేంజ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జింక (వన్య మృగం)ను వేటాడాడు. తుపాకీతో కాల్చి చంపాడు. తల వేరు చేసి, చర్మం వలిచి, మాంసం ఓ గదిలో దాచి పెట్టారు. షూటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయ్యింది. తుపాకీతో కాల్చి వేటాడినట్లు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జింకను కోసి, గదిలో దాచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లి జింక మాంసం, తల, చర్మం, పొట్ట, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడ వెటర్నరీ డాక్టర్ అరుణ అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

 తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు
 జింక చర్మాన్ని పరిశీలించగా రెండు చోట్ల తుపాకీ గుళ్లు లోపలికి చొచ్చుకొని వెళ్లినట్లు తెలుస్తోందని సీఐ తెలిపారు. ఉదయం 6 గంటలకే చంపి ఉంటారని పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో తలను వేరు చేసి చర్మాన్ని వలిచారని, గుట్టు చప్పుడు కాకుండా సెక్యూరిటీ గదిలో దాచి ఉంచారని తెలిపారు.

 ఎఫ్‌ఎస్‌ఎల్‌కు నమూనాలు
జింక మాంసం శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. జింకను ఎంతమంది వేటాడారో దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా కుక్కలు చంపేశాయని ప్రధాన నిందితుడుగా భావిస్తున్న షూటింగ్‌రేంజ్ కోచ్ గోవిందరావు పేర్కొన్నారు.
 
ప్రధాన నిందితుడు కోచ్
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టికి చెందిన పి.గోవిందరావు చందానగర్లో నివాసముంటూ పన్నెండేళ్లుగా సెంట్రల్ యూని వర్సిటీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ కోచ్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్ రేంజ్‌లో సాయి సెక్యూరిటీ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు ఉదయం ఐదుగురు, రాత్రి నలుగురు పనిచేస్తుంటారు. అయితే గోవిందరావు సెక్యూరిటీ గార్డులను ఉదయం 6 గంటలకే విధులకు రావాలని ఆదేశించినట్లు తెలిసిందని, ఈ క్రమంలోనే తుపాకీతో వేటాడి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మద్యం మత్తులో ఉన్న గోవిందరావు, శేరిలింగంపల్లిలో నివాసముండే సెక్యూరిటీ గార్డులు బి.చంద్రయ్య (65), ఎన్.రాజయ్య (54)లతో పాటు జింకను కోసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కోచ్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ‘ఉదయాన్నే రావాలని చెప్పాడు. 8 గంటలకు రాగానే జింక షూటింగ్ రేంజ్‌కు కొద్ది దూరంలో చనిపోయి ఉంది. ఎవరు చంపారో తెలియదు’ అని మరో సెక్యూరిటీ గార్డు బాలు ‘సాక్షి’తో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement