ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ... | Despite the lack of a complaint does not care ... | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ...

Published Wed, May 25 2016 12:03 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

ఫిర్యాదు చేసినా   పట్టించుకోలేదంటూ... - Sakshi

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ...

ఎలుకల మందు తాగి సీసీఎస్‌కు వచ్చిన గర్భిణి
జేసీపీ ఛాంబర్ ముందు కుప్పకూలిన వైనం

ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అధికారులు

 

హైదరాబాద్:   భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఏడు నెలల గర్భిణి మంగళవారం ఎలుకల మందు తాగి సీసీఎస్‌కు వచ్చిం ది. సంయుక్త పోలీసు కమిషనర్ (జేసీపీ) ఛాంబర్ వద్ద ఆమె కుప్పకూలడంతో పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా ధర్నారం గ్రామానికి చెందిన రేష్మ (27) అదే గ్రామానికి చెందిన అక్తర్ అహ్మద్(29)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకుంది. ప్రస్తుతం అక్తర్ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుండగా... వీరు జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి లో ఉంటున్నారు. రేష్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. నాలుగేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిం ది. రెండేళ్లుగా భర్త అక్తర్ కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో రేష్మ తల్లిదండ్రులు రూ.3 లక్షల వరకు చెల్లించారు. అదనపు కట్నం కోసం అక్తర్ వేధింపులు ఎక్కువ కావడంతో రేష్మ ఈనెల 20న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్తర్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కొన్నాళ్లు మంచిగా ఉన్న అక్తర్ మళ్లీ కట్నం పాతపంథానే అనుసరించాడు. దీంతో రేష్మ మంగళవారం సీసీఎస్‌లోని మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడానికి ఓ సహాయకుడితో కలిసి వచ్చింది. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావును కలిసేందుకు ఆయన ఛాంబర్ వద్ద వేచి ఉన్న ఆమె మంచినీళ్లు తాగేందుకు వెళ్తూ కుప్పకూలిపోయింది. 


అక్కడున్న పోలీసు అధికారులు హుటాహుటిన ఆమె వద్దకు వచ్చి సపర్యలు చేశారు. ఇంతలో ఆమెతో వచ్చిన వ్యక్తి రేష్మ ఎలుకల మందు తాగిందని చెప్పడంతో హుటాహుటిన కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఎలుకల మందు బయటికి తీయడానికి ప్రయత్నించగా రేష్మ సహకరించలేదు. రేష్మ ఏడు నెలల గర్భవతి కావడంతో ఉస్మానియా వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే గర్భిణి కావడంతో రెండు రోజులు అబ్జర్వేషన్ తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలమని ఉస్మానియా ఆసుపత్రి సీఎంఓ ధనుంజయ తెలిపారు. రేష్మ విషయంపై జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంటకరెడ్డిని వివరణ కోరగా... ‘ఈ నెల 20న తన భర్త కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, లుక్‌ఔట్ నోటీసులు సైతం జారీ చేశాం. అక్తర్ ఆచూకీ కోసం ఎస్సై విజయ్‌కుమార్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశాం’ అని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement