
దేవి కేసులో వీడిన మిస్టరీ!
కొలిక్కి వచ్చిన దేవి కేసు!
సీపీ మహేందర్ రెడ్డితో దేవీ తల్లిదండ్రుల భేటీ
సాక్షి, సిటీబ్యూరో: ఇంజనీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు ఆమె ప్రమాదంలోనే మృతిచెందిందని పోలీసుల మలి విచారణలో తేలినట్టు సమాచారం. ఈ విషయమై దేవి తల్లిదండ్రులను బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయానికి శనివారం పిలిపించి నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి... దేవిది హత్య కాదు రోడ్డు ప్రమాదమేనని వివరించినట్టు తెలుస్తోంది.
దేవి మరణంపై ఆమె తల్లిదండ్రులు లెవనెత్తిన సందేహాలకు సంబంధించి ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన సమాధానాలు కూడా ప్రమాదం వల్లే అలాంటి గాయాలవుతాయని స్పష్టం చేసినట్లు తెలుస్తోందని వారికి సీపీ వివరించినట్టు సమాచారం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బీపీఎం పబ్ నుంచి బయలుదేరిన వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదానికి గురవడం... ఆ తర్వాత అది ప్రమాదం కాదు హత్య అని దేవి తల్లిదండ్రులు ఆరోపించడం... ఈ మిస్టరీ నేపథ్యంలో తిరిగి పోలీసులు మళ్లీ విచారించడం తెలిసిందే. భరత్, దేవీకి సంబంధించి కాల్‌డేటా, ఫేస్‌బుక్ చాటింగ్‌లను కూడా పోలీసులు విశ్లేషించారు.