డీఐజీ పర్యవేక్షణలో చర్లపల్లి కారాగారం
Published Fri, Nov 25 2016 11:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం కొంతకాలం పాటు తెలం గాణ జైళ్ల శాఖ డీఐజీ ఆకుల నర్సిం హ పర్యవేక్షణలో కొనసాగనుంది. జైళ్ల శాఖలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీఐజీ నర్సింహ శుక్రవారం మాట్లాడుతూ జైల్‌లో భద్రత, ఖైదీల సమస్యలతో పాటుగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని డీజీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అలాగే ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన ఉప పర్యవేక్షణాధికారి రాజామహేశ్ బదిలీపై వెళ్లడంతో సిబ్బంది కొరత ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖైదీ లకు భోజనం, ఇతర సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. జైల్లో అవినీతి చోటు చేసుకుంటోందని వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నయీం అనుచరులకు సౌకర్యాల కల్పన, ఖైదీలకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
Advertisement