డిజిటల్ సచివాలయం
ఈ-ఆఫీసు విధానం అమలుకు అధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఇక ‘డిజిటల్’ కానుంది.. ఫైళ్ల నిర్వహణకు ప్రస్తుతమున్న టప్పాల్ విధానానికి స్వస్తి చెప్పి.. పూర్తిగా కాగిత రహితమైన డిజిటల్ ఈ-ఫైళ్ల విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సచివాలయంలో ఈ-ఆఫీసు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఐటీ విభాగం సచివాలయంలో ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జల మండలిలో ఈ-ఫైళ్ల విధానం అమల్లో ఉంది. అదే తరహాలో సచివాలయంలోనూ ఫైళ్ల కదలికకు ఎలక్ట్రానిక్, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెక్షన్ల నుంచి సీఎం పేషీ వరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేలా ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్) ఏర్పాట్లు చేస్తోంది.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ప్రస్తుతం అర్జీలు, పిటిషన్లన్నీ ఇన్‌వార్డ్ సెక్షన్‌లో చేరగానే దానికో నంబర్ వేసి సెక్షన్ ఆఫీసర్ ఫైలును సిద్ధం చేస్తారు. ఆ ఫైలు సంబంధిత అధికారులు, విభాగాలకు మధ్య సర్క్యులేట్ అవుతుంది. ఏ ఫైలు ఎప్పుడు ఎక్కడ ఉందో, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కష్టం. ఓ అధికారి నుంచి మరో అధికారికి వెళ్లడానికి సమయం పడుతుంది. అదే కొత్త విధానంలో సెక్షన్ ఆఫీసర్ ఈ-ఆఫీస్‌లో డిజిటల్ ఫైలును రూపొందిస్తారు. అక్కడి నుంచి సంబంధిత అధికారులు, సంబంధిత విభాగాలన్నింటికీ ఆన్‌లైన్‌లోనే వేగంగా ఫైలు సర్క్యులేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎవరి ఆమోదం అవసరమైనా.. వారు ఆన్‌లైన్‌లోనే అనుమతిస్తారు. సంబంధిత అధికారులు తమ డిజిటల్ సంతకాలను ఈ-ఫైలుపైనే పొందుపరుస్తారు.
ఈ డిజిటల్ ఫైల్‌కు అవసరమైనన్ని అటాచ్‌మెంట్లు, తమ కామెంట్లను, కొర్రీలను జత చేసేందుకూ వీలుంటుంది. అంతేగాకుండా సెక్షన్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఆ ఫైల్ ఎక్కడుందనే విషయాన్ని ట్రాకింగ్ పద్ధతిలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయంలో కొన్ని విభాగాల్లో ఏపీటీఎస్ తెలంగాణ యూనిట్ రూపొందించిన కే-మాటమ్ (నాలెడ్జ్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్) సాఫ్ట్‌వేర్ ద్వారా ఫైళ్లు నిర్వహిస్తున్నారు. దీన్ని అన్ని విభాగాలకు విస్తరించాలా, ఎన్‌ఐసీ రూపొందించిన ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను వాడాలా అనేది ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. ఐటీ విభాగం ఈ రెండింటిలో ఉన్న ప్రయోజనాలు, లోపాలను పోలుస్తూ తయారు చేసిన నివేదికను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే డిజిటల్ ఫైళ్ల విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సర్క్యులర్లు, మెమోలకు కొత్త వెబ్‌సైట్
ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లుగానే శాఖాపరమైన సర్క్యులర్లు, మెమోలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ శాఖ సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది కూడా. వాస్తవానికి పాత సర్క్యులర్లు, మెమోలు సరిగా అందుబాటులో ఉండని పరిస్థితి. ఒక్కోసారి కొన్ని సెక్షన్లలో గంటల తరబడిగా వెతకాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు వెబ్‌సైట్‌లో పొందుపరచటం సరైన మార్గమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఆర్థిక శాఖ జారీ చేస్తున్న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్‌వో)లను సైతం కొత్త వెబ్‌సైట్‌లో ఉంచాలని నిర్ణయించారు.