సంకెళ్ల సవ్వడి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో బొజ్జాతారకం, ప్రొఫెసర్ హరగోపాల్, రచయిత అరుణ్ ఫరేరా తదితరులు
- ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణలో జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
- జైళ్లలో పరిస్థితులపై వక్తల ఆవేదన
హైదరాబాద్: జైళ్లలో ఖైదీల మధ్య పోలీసులు చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. మలుపు సంస్థ ఆధ్వర్యంలో హక్కుల ఉద్యమ కార్యకర్త, పుస్తక రచయిత అరుణ్ ఫరేరా రచించిన ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వతపరిషత్ ఆడిటోరియంలో జరిగింది.
కార్యక్రమానికి సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రచయిత అరుఫ్ ఫరేరా జైళ్లలో తన అనుభవాలను పుస్తకంలో రాశారని చెప్పారు. రాజకీయ ఖైదీలు, సమాజాన్ని దోచుకునే ఖైదీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని వివరించారని పేర్కొన్నారు. అతి క్రూరమైన నేరాలు చేసినవారికి ములాఖాత్‌లో ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కానీ సాధారణ ఖైదీలను మాత్రం పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన వసతులు లేక ఖైదీలు ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి జైళ్లలో ఉంటుందన్నారు. అరుణ్ ఫరేరా మానవ హక్కులకు భంగం కలుగుతుందని విశ్వసిస్తేనే ఆయనపై పెట్టారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... జైళ్లలో ఉన్న పరిస్థితులను రచయిత అరుణ్ ఫరేరా ఎంతో సహనంతో రాశారన్నారు. జైళ్లలో అండా సెల్ పెట్టడం మానవత్వానికి విరుద్ధమన్నారు.
ఇప్పుడున్న పార్టీలకు రాజ్యాంగ విలువలు లేవని, రాజ్యం అమానుషంగా తయారైందని రచయిత తన పుస్తకంలో చెప్పారన్నారు. సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం మాట్లాడుతూ.... జైళ్లలో ఉన్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు రచయిత రాశారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో రచయిత అరుణ్ ఫరేరా, సామాజిక, రాజ కీయ పత్రిక దస్తక్ సంపాదకులు సీమా ఆజాద్, వీక్ష ణం ప్రధాన సంపాదకులు ఎస్.వేణుగోపాల్, బాల్‌రెడ్డి, విరసంనేత వరవరరావు పాల్గొన్నారు.