4, 5 వారాల్లోనే చర్య తీసుకోవాలి : వైఎస్సార్‌సీపీ
హైకోర్టు సూచనలను స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 90 రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు హైకోర్టు చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ తెలిపింది. స్పీకర్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం ప్రోదిగొలిపేలా కోర్టు సూచించినట్లు 90 రోజుల వ్యవధి కాకుండా, 4, 5 వారాల్లోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము 5, 6 పర్యాయాలు స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించినా ఇంతవరకు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై తాము కూడా పార్టీపరంగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ అమలు చేయాలని కోరారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రకారం ఎమ్మెల్యేలు విలీనమైనంత మాత్రాన పార్టీ విలీనమైనట్లు కాదని చెప్పారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగానే, స్పీకర్ కార్యాలయం ఆగమేఘాలపై శాసనసభాపక్షం విలీనమైనట్లు బులిటెన్ ఇవ్వడం సరికాదన్నారు. కేవలం ఎమ్మెల్యేలు కాకుండా పార్టీలు విలీనమైతేనే అది విలీనంగా గుర్తింపు పొందుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని గౌరవించేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు.