మతపరమైన రిజర్వేషన్లు వద్దు..
►ప్రభుత్వ యత్నాలన్నీ ఓట్ల కోసమే
►బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
►పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నం
►ఏకశిల పార్కు వద్దే అడ్డుకున్న పోలీసులు
కాళోజీ సెంటర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధమని, గతంలో ఓసారి రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయస్థానం కొట్టివేసినా తిరిగి అమలు చేసేందుకు యత్నించడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయడాన్ని నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. తొలుత హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. పార్కు నుంచి బయటకు రాకుండా గేట్లు వేయగా.. కొందరు గోడ దూకి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు పోలీసులు, బీజేపీ నాయకుల నడుమ తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్టు చేసి కలెక్టరేట్ ముట్టడిని భగ్నం చేసారు. ఈ సందర్బంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం మతపరమైన రిజర్వేషన్ల అమలుకు సిద్ధమవుతోందని విమర్శించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా.. మతాన్ని వాడుకోవడం సరికాదన్నారు. ఈ విషయమై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉన్నా టీఆర్‌ఎస్ తమపై నిందలు వేసి లబ్ధి పొందాలని చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్, జిల్లా అద్యక్షుడు కిరణ్, బీజేపీ జిల్లా కార్యదర్శి త్రిలోకేశ్‌తో పాటు ముత్యల శ్రీనివాస్, రవీందర్, సోల్తి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.