
నిరుద్యోగ యువతతో ఆటలాడుకోవద్దు
ఆరోగ్యమిత్రలను కొనసాగించాల్సిందే
- రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన ధర్మాసనం
- ఉన్నత అర్హతల జీవో-71 రద్దు
- రెండువేల మందికి హైకోర్టు ఊరట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యసేవా ట్రస్ట్ కింద వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న రెండువేల మంది ఆరోగ్యమిత్రలకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులై ఇప్పటికీ కొనసాగుతున్న వారి తొలగింపునకు దారి తీసేలా ఉన్నత విద్యార్హతలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 20న జారీ చేసిన జీవో 28ని రద్దు చేసింది. నిరుద్యోగ యువతతో ఆటలాడుకోవడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో కొనసాగుతున్న విధంగానే యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఆరోగ్యమిత్రలను తొలగించి, తమకు కావాల్సిన వారిని నియమించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్యమిత్రలకు ఉన్నత విద్యార్హతలను నిర్దేశించింది. ఇవి ఉన్న వారినే కొనసాగిస్తామంటూ జీవో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆరోగ్యమిత్రలు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, వైద్య సేవా ట్రస్ట్-ఆరోగ్యమిత్రల మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం లేదని, అందువల్ల వారు తమ వివాదాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పునిచ్చారు. అరుుతే రెండు నెలలపాటు కొనసాగవచ్చునంటూ ఈ ఏడాది మార్చి 31న సింగిల్ జడ్జి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆరోగ్యమిత్రలు ధర్మాసనం ముందు అపీళ్లు దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా అప్పీళ్లు దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు, వేదుల శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు వెలువరించింది. తీర్పు వివరాలిలా ఉన్నారుు..
వారిది యజమాని ఉద్యోగి సంబంధమే
ఆరోగ్య మిత్రలను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తీసుకునే నిమిత్తం ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 27న జీవో 71 జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు, సమాఖ్యలే ఆరోగ్యమిత్రల అర్హతలను నిర్దేశించారుు. రాతపరీక్ష, వైవా నిర్వహించి ఎంపిక చేసి ఆయా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు కేటారుుంచారుు. వారి వేతనం, నియమ నిబంధనలన్నింటినీ ప్రభుత్వమే నిర్ణరుుంచింది. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం లేదని చెప్పగలమా.? వారి మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం ఉందన్నదే మా ధృడమైన సమాధానం. రాజ్యాంగ, చట్టప్రకారం పాటించాల్సిన విధి విధానాల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ముసుగు ధరించి తెరవెనుక దాక్కుంది.
రెండువేల మందిని రోడ్డు పాలు చేసింది
అర్హత నిర్ణయం ఎప్పుడూ యజమాని పరిధిలోనిదే. యజమాని ప్రస్తుతం తన వద్ద తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల ఏరివేతకు ఉన్నత విద్యార్హతలను నిర్దేశించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. తగిన ఆర్హతలు లేకపోవడం వల్ల తగిన సేవలు, మార్గదర్శకత్వం చేయపోతున్నారని, దీని వల్ల రోగులకు సకాలంలో వైద్యసాయం అందడం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. ఆధారాలు చూపలేకపోయారు.పౌరుల తప్పేమీ లేకపోరుునా వారి న్యాయబద్ధ ఆకాంక్షలను కాలరాసేలా వ్యవహరించరాదు. వైద్యసేవా ట్రస్ట్ సీఈవో తీసుకొచ్చిన ఉన్నత విద్యార్హత ఆలోచన రెండువేల మందిని వీధుల పాలు చేసింది. సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నప్పుడు, పేదల పక్షాన నిలిచి ఆ అసమానతలను తొలగించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది.
ఆరోగ్యమిత్రలు యజమాని, ఉద్యోగి బంధం లేదన్న ప్రభుత్వ వైఖరితో, తమను తొలగించి మరికొందరిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిన తీసుకోవాలన్న నిర్ణయంపైనే హైకోర్టును ఆశ్రరుుంచారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మార్గదర్శకత్వం చేసేవారికి ఉన్నత విద్యార్హతలను నిర్దేశించడం ఎందుకో మాకు అర్థం కావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారిని మూకుమ్మడిగా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందన్న పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చలేకున్నాం. యజమాని, ఉద్యోగి సంబంధం కొనసాగుతున్నప్పుడు ఆరోగ్యమిత్రల దురవస్థను పట్టించుకోకుండా వారిని ఏకపక్షంగా తొలగించడానికి వీల్లేదు. అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది.
తెలంగాణలో పరిస్థితి ఇదీ...
ఆరోగ్యమిత్రల విషయంలో తెలంగాణలో పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశంలో ఆరోగ్యమిత్రలతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ.12వేలకు పెంచాలని నిర్ణరుుంచారు. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను చూసే విధానంలో ఎంత తేడా ఉందో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. శాశ్వత ప్రాతిపదిక పోస్టులను భర్తీ చేయనంతవరకు వారు తమ తమ పోస్టుల్లోనే కొనసాగుతారు. విధి నిర్వహణలో సక్రమంగా లేకుంటే వారిపై న్యాయసూత్రాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవచ్చు. అరుుతే ఉన్నత విద్యార్హతలు ఉన్నవారితో అదనపు పోస్టుల భర్తీకి ఈ తీర్పు ఎంత మాత్రం అడ్డంకి కాదు. అందువల్ల ఆరోగ్యమిత్రల తొలగింపునకు జారీ చేసిన జీవో 28ని రద్దు చేస్తున్నాం.