
దేవి మృతిపై అనుమానాలు!
నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థిని దేవి మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.. రెండు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నట్లు చెప్పిన కన్నకూతురు.. కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహితుడు భరత్‌తో కలిసి షెవ్రోలె క్రూయిజర్ కారులో వస్తుండగా తెల్లవారుజామున అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి.. చెట్టును ఢీకొంది. ఆ సమయంలో కారులో డ్రైవర్ సీటు వద్ద ఉన్న బెలూన్ మాత్రమే తెరుచుకుంది. దాంతో భరత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దేవి మాత్రం తీవ్రంగా గాయపడింది. పోలీసులు దేవిని అపోలో ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందింది.
ప్రమాదానికి రెండు నిమిషాల ముందే దేవి తమతో మాట్లాడిందని, ఆమె మృతిపై పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో భరత్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, అతడు ఎంత మద్యం తాగాడన్న రికార్డు చూపించడం లేదని, అలాగే కారు ఢీకొట్టినట్లు చెబుతున్న చెట్టు కూడా ప్రమాదంలో ధ్వంసమైనట్లు కాకుండా.. ఎవరో కావాలని నరికినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇలా దేవి మరణంపై పలురకాల అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.