గీత దాటారో.. లైసెన్స్ గోవిందా!
- ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాయింట్ల విధానంతో చెక్
- రెండేళ్లలో 12 పాయింట్లు వస్తే లైసెన్స్ రద్దు.. ఉత్తర్వు జారీ
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రయ్.. రయ్.. అంటూ దూసుకుపోయారో జాగ్రత్త! ఇప్పటివరకు పెనాల్టీలతో సరిపుచ్చిన అధికారులు ఇక ఏకంగా లైసెన్సునే రద్దు చేయబోతున్నారు. ఇందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. పెనాల్టీలతోపాటు ఆ నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వాటి సంఖ్య 12కు చేరితే లైసెన్సు రద్దవుతుంది. అదే లెర్నింగ్ లెసెన్సు ఉన్నవారికి ఆ పాయింట్ల సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. అంతకుమించితే వారి తాత్కాలిక లైసెన్సు కూడా రద్దవుతుంది.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. చలానా కట్టేస్తే సరిపోతుందనే ధీమాతో పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారికి ఇక ఈ కొత్త విధానంతో ముకుతాడు పడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో భారీ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారుల విషయంలో ఇక కఠినంగా ఉండబోతున్నారు.
అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో ఈ విధానం చక్కటి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమల్లోకి తేవాలని గతంలోనే నిర్ణయించి కసరత్తు చేసింది. రోడ్డు భద్రత చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిబంధనల విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని అటు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.వేలల్లో పెనాల్టీలు, లైసెన్సు రద్దు, వాహనాల జప్తు లాంటివి ఇందులో ఉండబోతున్నాయి. ఇది అమల్లోకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ల విధానానికి శ్రీకారం చుడుతోంది.
సీసీ కెమెరాలే ఆయుధం
ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్లలోని సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుల ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలు పంపుతున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కూడళ్లలోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి చిక్కటం ఖాయం. దాని ఆధారంగా ఆయా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌కు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని రవాణా శాఖ డేటాబేస్ ఎప్పటికప్పుడు లెక్క కడుతూ ఉంటుంది. రెండేళ్ల (24 నెలలు) సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్సు రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతుంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్లపాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్లపాటు లైసెన్సును రద్దు చేస్తారు.
పాయింట్లు ఇలా తగ్గించుకోవచ్చు
ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో వాహనా ల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశా లపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటివరకు వాహనదారుడి ఖాతాలో నమోదైన పాయింట్ల నుంచి మూడు పాయింట్లను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే రెండేళ్లలో రెండుసార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
ఉల్లంఘన పాయింట్లు
ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే 1
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2
హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపితే 1
రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే.. 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3
ప్రమాదకరంగా వాహనం నడపడం/సెల్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్ 2
మద్యం తాగి బైక్ నడిపితే, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే.. 3
మద్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4
మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగినడిపితే 5
ఇబ్బంది కలిగేలా నడిపితే/శబ్ద, వాయు కాలుష్యానికి కారణమైనా/అనుమతిలేని చోట పార్క్ చేసినా.. 2
బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2
అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2
ర్యాష్ డ్రైవింగ్/ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపరిచేలా నడిపితే 2
నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే.. 5
వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీ.. తదితర నేరాలకు పాల్పడితే 5