
మద్యం మత్తులో యువకుల వీరంగం
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని అల్కాపురిలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు యాదగిరిరెడ్డిపై కారు దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీకెండ్ కావడంతో గతరాత్రి అల్కాపురి ప్రధాన రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో ఎల్బీనగర్ నుంచి నలుగురు యువకులు వేగంగా కారు నడుపుతూ వచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు బారీ కేడ్లు అడ్డుపెట్టారు. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో యువకులు కారు వేగం పెంచి... బారీకేడ్లను బలంగా ఢీకొట్టారు. యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా... రోడ్డుపై ఓ గుంతలో కారు ఇరుక్కుపోవడంతో ఎటూ వెళ్లలేకపోయారు. ఈ ఘటనలో హోంగార్డు యాదగిరిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. ఘటనకు కారణమైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న ఏపీ09 సీఏ4444 కారును సీజ్ చేశారు. గాయపడిన హోంగార్డును ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.