డ్రంకెన్ డ్రైవ్ @ 24/7
పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ప్రత్యేక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనాలు నడిపి తమ ప్రాణాలతోపాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్న డ్రంకెన్ డ్రైవర్లను నియంత్రించడంపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాచకొండ లోని మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, భువనగిరి జోన్‌లలో డైనమిక్ డ్రంకెన్ డ్రైవ్‌ను అమలు చేయనున్నారు. గతంలో శుక్ర, శనివారాల్లో రాత్రి వేళల్లోనే డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన రాచకొండ పోలీసులు మందు బాబుల వీరంగాలతో గత కొన్ని నెలల నుంచి వారంపాటు స్పెషల్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. ఇకపై పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను తనిఖీ చేయను న్నా రు. ప్రత్యేక తనిఖీలతో కొంత మేర రోడ్డు ప్రమా దాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
ఇక అన్ని వేళల్లో..
తెల్లవారుజామున, ఉదయం, మధ్యాహ్నం వేళల్లో యువత మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలపై దూసుకుపోతున్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో చేపట్టే డ్రంకెన్ డ్రైవ్‌ల వల్ల పూర్తిగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించ లేకపోతున్నామని భావించిన ఉన్నతాధికారులు డ్రంకెన్ డ్రైవ్ వేళల్లో మార్పులు చేసి కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ తనిఖీలను అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. తెల్లవారుజామున, ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. గతంలో పరిగణనలోకి తీసుకోని ప్రాంతాలు, వారాంతాలు కాకుండా మిగిలిన రోజుల్లో జరిగే కార్యక్రమాలు, ఆదివారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనల జాబితాను సేకరిస్తారు.
ఆయా చోట్ల మద్యం ప్రవాహం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ డ్రంకెన్ డ్రైవ్‌లు చేపడతారు. రోజూ పార్టీల పేరుతో మద్యం తాగేవారు రాత్రి వేళల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన వేళల్లో పీకలదాకి వాహనం నడుపుతూ ఎదుటివాళ్లకు ఇబ్బందికరంగా మారుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ ఏడాది ఇప్పటివరకు రాచకొండ పోలీసులు 3,498 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఓఆర్‌ఆర్‌పై అతివేగంతో వెళ్లిన 5,725 వాహనాలపై ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేశారు.
ఔటర్‌పైనా తనిఖీలు ముమ్మరం..
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై రోడ్డు ప్రమా దాలు జరగుతుండటంతో అక్కడ కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలకు పూర్తి స్థాయిలో శ్రీకారం చుడుతున్నారు. టోల్‌ప్లాజా ర్యాంపుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడ సమయంతో నిమిత్తం లేకుండా తనిఖీలు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ సమకూర్చిన 12 బ్రీత్ అనలైజర్లను ఉపయోగించి మందుబాబుల ఆగడాలకు కళ్లెం వేస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండలో డైనమిక్ డ్రంకెన్ డ్రైవ్‌ను పటిష్టంగా అమలు చేస్తామన్నారు.