- కేసును కొలిక్కి తీసుకొచ్చిన సీఐడీ
- నిందితుడు ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్‌గా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణాన్ని నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) కొలిక్కి తీసుకొచ్చింది. ఈ కుంభకోణానికి అసలు సూత్రధారి ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు సునీల్ కుమార్ సింగ్‌గా నిర్ధారించింది. ప్రస్తుతం అతడు నేపాల్‌లో తలదాచుకున్నట్లుగా పక్కా సమాచారాన్ని సేకరించింది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బ్రోకర్లుగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ పేపర్ లీకేజీ కుంభకోణంతో 128 మంది విద్యార్థులు లబ్ధిపొందినట్లు సీఐడీ నిర్ధారించింది. ఎంపిక చేసిన 6 ప్రాంతాల్లో పరీక్షకు రెండు రోజుల ముందు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినటు ఆధారాలను సేకరించింది. వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఈ కుట్రలో 58 మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు సీఐడీ దృష్టికి వచ్చింది. వీరిలో 33 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరిని ఢిల్లీలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన 33 మందిలో 22 మంది తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు కాగా, ఒకరు తమిళనాడు, పది మంది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారున్నారు. మరో 23 మందిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐడీ పేర్కొంది. వీరిలో నలుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. మిగతా వారు ఢిల్లీకి చెందిన వారున్నట్లు పేర్కొన్నాయి.
ఒక్కో విద్యార్థి నుంచి రూ.25 లక్షలు..
ఎంసెట్-2 ద్వారా సునీల్‌సింగ్, అతని మనుషులు ఆర్థికంగా భారీగా లబ్ధిపొందినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీకైన వెంటనే సునీల్ సింగ్ మే 25న తనకు పరిచయమున్న కన్సల్టెన్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. ఆరుగురు వ్యక్తులకు పేపర్ అప్పగించి ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.25 లక్షలు వసూలు చేయాలని షరతు విధించాడు. అక్కడి నుంచి ఆరుగురు వ్యక్తులు సబ్‌బ్రోకర్లకు అప్పగిస్తూ ఆ రేటు పెంచుకుంటూ పోయారు. ఈ కుంభకోణం ద్వారా బెంగళూరు, ముంబై, పుణే, షిర్డీ, కటక్, కోల్‌కతా కేంద్రంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే షిర్డీ కేంద్రంగా శిక్షణ తీసుకున్న విద్యార్థులతో ఒక్కొక్కరి నుంచి రూ.65 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగుచూసింది.
2011లో కూడా..
2011లో ఛత్తీస్‌గఢ్‌లో మెడికల్ ప్రవేశ పరీక్ష పత్రం లీక్‌లో సునీల్ హస్తం ఉంది. అప్పుడు కూడా ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఉన్న తన మనుషుల ద్వారా పేపర్ లీక్ చేసినట్లు రుజువైంది. దీంతో అక్కడి న్యాయస్థానాలు ఆరేళ్ల జైలు శిక్ష విధించాయి. అయితే ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తాత్కాలిక బెయిల్ పొందాడు. మళ్లీ ఎంసెట్-2 పేపర్‌ను కూడా ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి సునీల్ వ్యక్తులే తస్కరించినట్లు సీఐడీకి బలమైన ఆధారాలు లభించాయి.
‘ఎంసెట్-2’ సూత్రధారి సునీల్‌సింగ్
Published Thu, Sep 29 2016 2:33 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement