తెలుగు నేర్చుకుంటున్నా..టాలీవుడ్ సినిమాల్లో నటిస్తా : చాందినీ శర్మ
‘సినిమాలే నా లక్ష్యం. ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్నా. టాలీవుడ్‌లో నటించాలనుంది’ అంటూ తన సిల్వర్‌స్క్రీన్ డ్రీమ్స్‌ను వెల్లడించింది తాజా ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీ విజేత చాందినీ శర్మ. ముంబయిలో ఇటీవలే జరిగిన పోటీల్లో బాలీవుడ్ సీనియర్ తారలు గోవిందా, జుహీచావ్లాల చేతుల మీదుగా అందాల కిరీటాన్ని దక్కించుకున్న ఈ సుందరాంగి... శుక్రవారం నగరానికి వచ్చింది. ఈ సందర్భంగా మారియట్ హోటల్‌లో ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ బ్యూటీక్వీన్ చెప్పిన ముచ్చట్లు మీరే దవండి.
సినిమాలంటే ఇష్టం..
మాది హిమాచల్‌ప్రదేశ్. నాన్న ఇంజినీర్. అమ్మ హౌస్‌వైఫ్. అన్నయ్య, చెల్లి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గ్లామర్ రంగంలోకి, మరీ ముఖ్యంగా మోడలింగ్ లోకి అమ్మాయిలు రావడం అరుదే. నాకుకూడా ఎప్పుడూ మోడలింగ్ కలలు లేవు. కానీ సినిమాలంటే మాత్రం బోలెడు ఇష్టం. చండీఘడ్‌లో ఇంజినీరింగ్ చదువుకుంటూ అప్పుడప్పుడు కాలేజీలో ర్యాంప్‌వాక్ చేసిన అనుభవం తప్ప మరే రకంగానూ మోడలింగ్‌తో పరిచయం లేదు. కాకపోతే ఇంద్రాణి దాస్ గుప్తా లాంటి సక్సెస్‌ఫుల్ మోడల్స్ గురించి తెలుసుకునేదాన్నంతే.
యావరేజ్ స్టూడెంట్‌ని..
చదువులో నేను యావరేజ్. ఇంట్లోవాళ్లు ఈ విషయం అన్నప్పుడల్లా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆకాంక్ష వారితో పంచుకునేదాన్ని. అదే సమయంలో ఇండియన్ ప్రిన్సెస్ పోటీ గురించి తెలిసి సరదాగా అప్లయ్ చేశాను. అనూహ్యంగా ఎంపికయ్యాను. నిజానికి ఫైనలిస్ట్‌లో నా ప్లేస్ చూసినప్పుడే ఆశ్చర్యం వేసింది. అందులోనూ దాదాపు 30 మంది అందగత్తెలు... ఎవరికి ఎవరూ తీసిపోనట్టు ఉన్నారు. నాకన్నా అందంగా ఉన్నారు. అలాంటి తెలివైన, బ్యూటిఫుల్ గాళ్స్‌తో పోటీపడి తొలి ప్రయత్నంలోనే ఏకంగా కిరీటం కూడా దక్కించుకున్నాను. హైదరాబాద్ అమ్మాయి డెబొరాకు కూడా బెస్ట్ హెయిర్ అవార్డ్ వచ్చింది తెలుసా..!
కల నిజమాయెగా..
నిన్నటి స్టార్స్ గోవిందా, జుహీచావ్లాలు కిరీటాన్ని అలంకరిస్తుంటే కల నిజమైన క్షణంలా అనిపించింది. మా ఇంట్లో వాళ్లు నా విజయాన్ని ఆస్వాదించారు. సినిమా తార కావాలని తప్ప మరో కెరీర్‌ను నేనెప్పుడూ ఎంచుకోలేదు. ఈ కిరీటాన్ని ఆధారంగా చేసుకుని వెండితెరపై వెలగాలనే నా కల నిజం చేసుకోవాలనుకుంటున్నాను. మీకో విషయం తెలుసా..! నాకు కొంచెం తెలుగు వచ్చింది (కొన్ని పదాలు పలుకుతూ...) టాలీవుడ్‌లో నటించడానికి కూడా నేను రెడీ.
ఎన్నో నేర్పింది..
ఈ పోటీల కోసం కొన్ని నెలల పాటు నిర్వహించిన శిక్షణ నాకెన్నో నేర్పింది. అంతకు ముందు సరైన లక్ష్యం లేకుండా గడిచిన జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది. గతంలో నాకు అలవాటు లేని యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్... వంటి వ్యాయామాలు, చక్కని ఆహారపు అలవాట్లు నేర్పింది. మొత్తంగా నా జీవనశైలిని తీర్చిదిద్దింది. అందుకు నేను ఈ పోటీలకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంతర్జాతీయస్థాయి అందాల పోటీల్లో పాల్గొనడం, సినిమా అవకాశాలకు సిద్ధమవడం ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు.