ఎన్నికల తర్వాతే డూప్లికేట్ ఓట్ల తొలగింపు
♦ హైకోర్టుకు నివేదించిన సీఈసీ
♦ వ్యాజ్యాలను పరిష్కరించినట్లు కోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో ఉన్న 7.9 లక్షల డూప్లికేట్ పేర్లను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తొలగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సీఈసీ రాతపూర్వకంగా చేసిన ఈ ప్రకటనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, 6.3 లక్షల ఓటర్ల తొలగింపుపై తుది నిర్ణయం తీసుకునే వరకు వార్డుల ఖరారుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిమిత్తం బీసీ ఓటర్ల జాబితాను లెక్కించి వార్డులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోందని, తొలగించిన 6.3 లక్షల ఓటర్ల విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు వార్డుల ఖరారుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ నేత నాగేశ్ ముదిరాజ్, టీడీపీ కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం మరోసారి విచారించారు. సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ సాప్ట్‌వేర్ ద్వారా బయటపడ్డ 7.9 లక్షల డూప్లికేట్ పేర్లను ఇప్పటికిప్పుడు తొలగించడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే చేపడతామని తెలిపారు.