
అదీ...ఈటెల హుందాతనం
నిజామాబాద్ ఎంపీ కవిత విషయంలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఎంత దుమారం రేపాయో తెలుసు.
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత విషయంలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఎంత దుమారం రేపాయో తెలుసు. ఆ వ్యాఖ్యలు అసత్యాలతో కూడుకున్నవని పేర్కొంటూ పాలకపక్షం అధికారులిచ్చిన వివరాలతో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల ను ఉపసంహరించుకోవాలంటూ ఇతర పక్షాలూ రేవంత్‌కు సూచించాయి. కానీ, ఆయన బెట్టు వీడకపోవటం, పాలకపక్షం పట్టుబట్టడం.. వారంపాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. ధర్నాలు.. అరెస్టులు.. ఆందోళనలు.. గవర్నర్‌కు ఫిర్యాదు.. చకచకా జరిగిపోయాయి. కానీ, శుక్రవారం బడ్జెట్ చర్చకు వివరణ ఇచ్చే క్రమంలో ఆర్థికమంత్రి ఈటెల హుందాగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ సభ్యులు విమర్శలు చేస్తూ పదేపదే ఈటెల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్పుడు పలుమార్లు ఆయన కాస్త ఆవేశంగానే మాట్లాడారు. చర్చ కొనసాగుతుండగా.. అంతకుకాస్త ముందే బయటకు వెళ్లిన కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి సభలోకి వచ్చారు. రావటంతో మైకు అడిగి తీసుకున్నారు. ‘సభ్యుల హుందాతనం గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం.
అయినా మంత్రి కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి దుర్మార్గులు అని సంబోధించినట్టు గుర్తించా.. దానికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. లేదంటే మేం సభలో ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నా’ అంటూ ఆగ్రహంగా మాట్లాడారు. దీంతో ఈటెల లేచి..‘అలాంటి మాటలు అనే అలవాటు నాకు లేదు. నేను అలా అన్నానని కూడా అనుకోవటం లేదు. అయితే ఆవేశంలో పారపాటున ఆ పదం దొర్లి ఉంటే వెంటనే ఉపసంహరించుకుం టూ రికార్డుల్లోంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. భవిష్యత్తులో మరింత సంస్కారంతో వ్యవహరించేప్రయత్నం చేస్తాను’ అని వినమ్రంగా అన్నారు.