
చంపేస్తామని...మాజీ ఎంపీకి బెదిరింపు కాల్స్
హైదరాబాద్ : మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరించినట్లు హుస్సేనీఆలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... కొందరు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గత నెల 31న హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే సంశయంతో హుస్సేనీఆలం పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా...కేసు నమోదు చేయాలని కోర్టు ఈనెల 5న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై విచారణ చేపట్టారు.