నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి | Exploitation of regular petrol. Crore | Sakshi
Sakshi News home page

నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి

Published Tue, Mar 4 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి

నిత్యం పెట్రో దోపిడీ రూ.కోటి

  •     ‘పంపింగ్ జంపింగ్’తో బంకుల నయా‘వంచన’
  •      ఐదేళ్లుగా పలురకాల ఇం‘ధన’ మోసాలు
  •      వాహన చోదకుల జేబులకు భారీగా చిల్లు
  •      పట్టని తూ.కొ. సివిల్ సప్లై శాఖలు
  •  సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ పరిధిలో పలు బంకులు రోజుకు రూ. 95.88 లక్షల మోసానికి పాల్పడుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత ఐదేళ్ల నుంచి పెట్రోల్ బంకుల రిమోట్ మోసాలు చాప కింద నీరులా సాగుతున్నట్లు బహిర్గతమైంది. సాక్షాత్తు పెట్రోల్ బంకుల డీలర్లే తప్పు మాది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూ మోసాలను అంగీకరించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేస్తున్నట్లు డీలర్లు స్పష్టంచేయడం నయా‘వంచన’ను తేటతెల్లం చేస్తుంది.

    రాష్ట్రం మొత్తంమీద పెట్రోల్ వినియోగంలో సగం వాటా గల  మహాన గరంలో బంకుల నయామోసాలు వినియోగదారుల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. మహానగరంలో సుమారు 330 పెట్రోల్ బంకులు ఉండగా.. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుందన్నది అంచనా. బంకుల్లో ఫిల్లింగ్ మిషన్ పైకి అంతా సవ్యంగానే కనిపించినప్పటికీ రిమోట్ కంట్రోల్ ద్వారా రీడింగ్‌ను జంపింగ్ చేయిస్తే కనీసం ప్రతి వెయ్యి లీటర్లుకు 40 లీటర్ల ఇంధనం తక్కువగా పంపింగ్ జరుగుతుంది.

    ఈ లెక్కన నగరంలో ప్రతిరోజు 30 లక్షల లీటర్లకు గాను 1.20 లక్షల లీటర్లు తక్కువగా పంపింగ్ జరగుతున్నట్లు అంచనా. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ. 79.90. దీని ప్రకారం లెక్కిస్తే.. రోజుకు పెట్రోల్ మోసం విలువ రూ.95.88 లక్షలు. గత ఐదేళ్లుగా సాగుతున్న పెట్రోల్ మోసాల దోపిడీని లెక్కిస్తే...  మహా నగరవాసుల కళ్లు బైరు కమ్మడం ఖాయం.
     
    తనిఖీ భయంతో సమ్మెకు దిగి..
     
    ఈ నేపథ్యంలో తూనికలు, కొలతల శాఖ వరుస ఆకస్మిక దాడులతో బెంబేలెత్తిన పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మెరుపు సమ్మెకి దిగి.. ఇరవై నాలుగు గంటల తర్వాత తామంతట తామే బేషరతుగా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. నయామోసాల తప్పు తమది కాదు.. ఆయిల్ కంపెనీలదంటూనే తక్షణమే రిమోట్లను సరెండర్ చేసి ప్రభుత్వం ఆమోదం లేని డిస్పెన్సింగ్ యూనిట్లను మార్పు చేసుకుంటామని లిఖిత పూర్వకంగా తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు.
     
    నివ్వెరపర్చిన నయామోసాలు..
     
    మహానగరంలో బంకుల నయామోసాలు నివ్వెరపర్చాయి. ఇప్పటివరకు పెట్రో ఫిల్లింగ్ మిషన్లలో చేతివాటం ప్రదర్శించి హెచ్చు తగ్గులతో మోసాలకే పాల్పడే బంకులు.. ఏకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువుగా మార్చుకొని స్టాఫ్‌వేర్‌నే కంట్రోల్ చేసే విధానానికి దిగడం విస్మయానికి గురిచేసింది. సరిగ్గా  నెలరోజుల క్రితం సైబరాబాద్ ప్రత్యేక పోలీసులు బృందం చేతిలో ఒక నకిలీ సాఫ్ట్‌వేర్ ముఠా చిక్కడంతో పెట్రో చిప్‌ల మోసాల వ్యవహారం బయటపడింది. ఎస్‌ఓటీ పోలీసులు సుమారు 11 ఫిల్లింగ్ స్టేషన్లలో అమర్చిన చిప్‌లను తొలగించి నిందితులను కటకటాల వెనక్కి పంపించారు. తూ.కొ. శాఖ కు కేసు బదిలీచేసి మరో 70 బంకుల్లో చిప్‌లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసినా ఫలితం లేదు. తూ.కొ. శాఖ తీరిక చేసుకొని మొక్కుబడిగా కొన్ని బంకులను తనిఖీ చేయగా మరో కొత్త తరహా మోసం బయటపడటం ఖంగు తినిపించింది.
     
    కంచే చేను మేస్తే..
     
    సాక్షాత్తు ప్రధాన ఆయిల్ కంపెనీలే మోసాలకు సహకరించే డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్లను సరఫరా చేయడం విస్మయపర్చింది. ముంబైలోని టట్‌సునో ఇండియా ప్రయివేటు లిమిటేడ్, డ్రెసర్‌వేన్ కంపెనీలు ఉత్పిత్తిచేసిన డిస్పెన్సింగ్ యూనిట్లతోపాటు రిమోట్‌లను తమ డీలర్లకు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీతో పాటు మరో ప్రయివేటు షెల్ కంపెనీ కూడా సరఫరా చేసింది.   

    దీంతో రెండు కంపెనీలు ఉత్పత్తి చేసిన డిస్పెన్సింగ్ యూనిట్లపై తూ. కొ. అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రస్థాయిలో వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ కోసం ఆరా తీసి రెండు రోజుల క్రితం దాడులు నిర్వహించగా.. రిమోట్ అమ్మకాల వ్యవహారం బయటపడింది. సుమారు 250 వరకు రిమోట్లు సరఫరా జరిగినట్లు విచారణలో తెలింది. దీంతో తూ.కొ. ఉన్నతాధికారులు విస్తృత దాడులకు ఆదేశించడంతో పెట్రో బంకుల డీలర్లు వేధింపులంటూ సమ్మెకు దిగి పెట్రో బంకులను బంద్ చేసి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు.
     
    ఆర్టీసీకి పెరిగిన ఆదాయం
     
    సుమారు 24 గంటల పాటు  నగరంలో పెట్రోల్ బంకులు మూతపడడంతో ఆర్టీసీ బస్సులకు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి  సోమవారం మధ్యాహ్నం వరకు బంకులు మూతపడడంతో చాలామంది వాహ నదారులు బస్సులను ఆశ్ర యించారు. దీంతో సాధారణ రోజుల్లో రూ.2.6 కోట్లు లభిస్తుండగా.. ఆదివారం ఒక్క రోజు రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు ఆర్టీసీ  అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రతి రోజు 35 లక్షల మంది సిటీ బస్సుల్లో  ప్రయాణిస్తున్నారు. బంకుల మూసివేత దృష్ట్యా 5 లక్షల మంది అదనంగా పయనించినట్లు ఆర్టీసీ అంచనా.  
     
    చంచల్‌గూడ వద్ద జనజాతర..

     
    చంచల్‌గూడ: తూనికలు, కొలతల శాఖ దాడులను నిరసిస్తూ నగరంలోని పెట్రోల్ బంకుల యజమానులు బంద్ పాటించిన నేపథ్యంలో చంచల్ గూడలోని జైళ్ల శాఖకు చెందిన పెట్రోల్ బంకు మాత్రం వినియోగదారుల సౌకర్యార్థం ఇంధనం విక్రయించారు. ఆదివారం సాయంత్ర 6 నుంచి 9 గంటల వరకు రూ. 4 లక్షల ఇంధనం విక్రయించినట్లు బంకు ఇన్‌చార్జి, డిప్యూటీ జైలర్ గణేష్‌బాబు సూచనప్రాయంగా తెలిపారు. సాధారణ రోజుల్లో 14 వేల లీటర్ల పెట్రోల్, 8 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. సమ్మె ప్రభావం వల్ల అదనంగా 6 వేల లీటర్ల పెట్రోల్ విక్రయించినట్లు తెలిపారు.ఆ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసింది.
     
     కలెక్టర్ సీరియస్


     పెట్రోల్ బంకు డీలర్ల మెరుపు సమ్మెతో ప్రజలు ఇబ్బందులకు గురికావడంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సీరియస్ ఆయ్యారు. సోమవారం పెట్రోల్  డీలర్ల సమ్మెపై గవర్నర్ మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ద్వారా అందడటంతో కలెక్టర్ హుటాహుటిన  సివిల్‌సప్లై, తూనికలు కొలతల శాఖ అధికారులతోపాటు ఆయిల్ కంపెనీలు, డీలర్ సంఘం ప్రతినిధులను పిలిపించి చర్చించారు. పెట్రోలియం డీలర్లు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగి బంకులు బంద్ పాటించడమేమిటని ప్రశ్నించారు.ప్రభుత్వ ఆమోదం లేని పరికరాలు వినియోగించడం చట్టవిరుద్దమన్నారు. సివిల్స్ సప్లై, తూనికలు, కొలతల శాఖ అధికారులు సమన్వయంతో ఆయిల్ కంపెనీలతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు. పెట్రోల్ బంకుల బంద్ పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement