‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు! | Fake baba | Sakshi
Sakshi News home page

‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు!

Published Thu, Jun 16 2016 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు! - Sakshi

‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు!

- హైదరాబాద్‌లో దొంగ బాబా ఘరానా మోసం
- బాధితుడు ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డి
 
 హైదరాబాద్: ఓ దొంగ బాబా.. భార్యా, పిల్లలతో ఓ అమాయకుడు.. మంత్రాలతో ఉన్న బంగారాన్ని రెండింతలు చేస్తానంటూ బాబా మాయమాటలు.. నెక్ట్స్ సీన్.. గోల్డ్ బాబా చేతికి.. చిప్ప బాధితుడి చేతికి!    - ఇది రీల్ కథ

 కర్ణాటక నుంచి ఓ దొంగ బాబా.. యజమాని ఆహ్వానం మేరకే ఇంటికొచ్చాడు.. కుటుంబానికి పట్టిన కీడు తొలగిస్తానన్నాడు.. ముగ్గులేసి ఏవేవో పూజలు చేశాడు.. ఇంట్లో ఉన్న సొమ్మంతా తెచ్చి పెట్టమన్నాడు.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.కోటి 30 లక్షలు తెచ్చి పెట్టారు.. కాసేపటికి బాబా ప్రసాదం పెట్టాడు.. అది తిన్న యజమాని, భార్య, కొడుకు స్పృహ కోల్పోయారు.. ఇంకేముంది ఆ డబ్బుతో బాబా పరార్!!    - ఇది ‘రియల్’ మోసం

 అచ్చూ సినీపక్కీలో జరిగిన ఈ ఘరానా మోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చి దొంగ బాబా రూ.కోటి ముప్పై లక్షలతో ఉడాయించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన తన కుటుంబానికి పట్టిన కీడు తొలగిపోవాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని కర్ణాటకకు చెందిన ఓ బాబాను సంప్రదించాడు. తాను పూజలు చేస్తే ఎంతటి కీడైనా తొలగిపోతుందని, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని బాబా నమ్మించాడు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మధుసూదన్‌రెడ్డికి సూచించారు.

మంగళవారం  ఉదయం కర్ణాటక నుంచి వచ్చిన బాబాకు మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో బస కల్పించారు. పూజకు కావాల్సిన సామగ్రిని మంగళవారమే కొనుగోలు చేయించారు. బుధవారం ఉదయం.10.30 గంటలకు మధుసూదన్‌రెడ్డి ఇంటికి వచ్చిన బాబా హాల్‌లో ముగ్గులు వేసి నిమ్మకాయలతో అలంకరించాడు. మధుసూదన్‌రెడ్డితో పాటు ఆయన భార్య విద్యావతి, కొడుకు సందేశ్‌రెడ్డిలను పూజల్లో కూర్చోబెట్టాడు. డబ్బు ఎంత ఉంటే అంత పూజ దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుందని, దోషాలు తొలగిపోతాయని, గ్రహాలు అనుకూలిస్తాయని చెప్పాడు.  దీంతో మధుసూదన్‌రెడ్డి తన వద్ద ఉన్న రూ.కోటి 30 లక్షల నోట్ల కట్టలను ముగ్గులో పేర్చాడు.

 ప్రసాదం తినగానే కుప్పకూలిన వైనం..
 మధ్యాహ్నం దాకా బాబా ఏవేవో పూజలు చేశాడు. 3.30 గంటల ప్రాంతంలో పూజలు అయిపోయినట్లు ప్రకటించిన బాబా మధుసూదన్‌రెడ్డికి, ఆయన భార్య, కొడుకుకు ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం తిన్న కొద్ది క్షణాలకే ఆ ముగ్గురూ కుప్పకూలారు. వాళ్లు  కింద పడిపోగానే బాబా తన చేతికి పని చెప్పాడు. ముగ్గులోని నగదును బ్యాగులో సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటికి పని మనుషులు, డ్రైవర్ లోనికి వచ్చారు. ముగ్గురూ కిందపడి ఉండటం చూసి అపోలో ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న సందేశ్ జరిగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మధుసూదన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చారు. విద్యావతి, సందేశ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మధుసూదన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి కోలుకుంటే ఈ దొంగ బాబాకు సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. బాబా కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. బాబా కారు డ్రైవర్ శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబా జాడ కోసం రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో నిఘా ఉంచారు. బెంగళూరు రహదారిలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement