గురువుతో కలిసే తొలి బురిడీ! | The first fake Baba Shiv fraud | Sakshi
Sakshi News home page

గురువుతో కలిసే తొలి బురిడీ!

Published Fri, Jun 17 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

గురువుతో కలిసే తొలి బురిడీ!

గురువుతో కలిసే తొలి బురిడీ!

కేపీహెచ్‌బీలో తొలిసారి నకిలీ బాబా శివ మోసం
ఇప్పటికి ఆరుసార్లు అరెస్టు, మూడింట్లో వాంటెడ్
నాలుగు ఠాణాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూలు
ఏడేళ్లలో రూ.4.25 కోట్లకు పైగా మోసాలు

 

సిటీబ్యూరో:  ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డిని ‘రెట్టింపు’, ‘రైస్‌పుల్లింగ్ కాయిన్’ పేర్లతో బురిడీ కొట్టించిన బుడ్డప్పగారి శివ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగర పోలీసులు ఇతడితో పాటు సహకరించిన దామోదర్, శ్రీనివాసరెడ్డిల్నీ శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘తొలి పూజ’ను తన గురువుతో కలిసే చేసినట్లు వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి రమణ విద్యుత్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందారు. 1996లో ఇంటర్నీడియట్ చదువును మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బెంగళూరు చేరాడు.

 
ఉద్యోగం... ఏజెన్సీ... ‘ఆశ్రమావతారం’...

బెంగళూరులో రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతడి ద్వారా శివ శాంతి సాగర్ హోటల్‌లో ఉద్యోగంలో చేరాడు. ఆపై అక్కడి తిప్పసముద్రం ప్రాంతంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా విద్యుత్, పారిశుద్ధ్య కార్మికుల్ని పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకూ ఈ పనీ మానేసిన శివ బెంగళూరులోని  శివ సాయిబాబ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. అక్కడ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడులో ఉన్న మరో ఆశ్రమానికి వచ్చినా... మళ్లీ పాత ఆశ్రమానికే చేరాడు. కొన్నాళ్లు అక్కడ పని చేసిన తర్వాత తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి హ్యూమన్ బాడీ లాంగ్వేజ్, ఆయుర్వేద వైద్యం అంశాలు నేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఇతరులకు మత్తు ఇవ్వచ్చనే విషయం తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ శివ సాయిబాబ ఆశ్రమానికే చేరాడు.

 
గురువుతో కలిసి కేపీహెచ్‌బీలో పంజా....

ఈ ఆశ్రమంలో శివకు అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే లక్ష్మీ పూజలతో నగదు రెట్టింపు, అష్టదిగ్భంధనమంటూ మోసం చేయడం ఎలానో నేర్చుకున్నాడు. ఆపై 2009లో ఈ గురువుతోనే కలిసి నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశారు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చమ్‌రాజ్‌నగర్‌లో రూ.10 లక్షలు పట్టుకుపోయాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ ఆపై తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. శివ తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపు అవుతుం దని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచి న నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. ఆపై రెట్టింపు మొత్తాన్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఆపై ఈ బురిడీ బాబా అసలు కథ ప్రారంభించి అందినకాడికి దండుకుంటాడు.

 
రెండు నెలల నుంచీ ప్రిపరేషన్...
ఏడాదిన్నరగా ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డితో పరిచయం కొనసాగిస్తున్న, గతంలోనే రూ.లక్ష ‘లాభం’ చేకూర్చిన శివ రెండు నెలల క్రితమే ‘ముగ్గులో దించేందుకు’ పథకం వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్నీ ‘కొత్తవి’ సిద్ధం చేసుకున్నాడు. రెండు నెలల క్రితమే బెంగళూరు శివార్లలోని సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లేఔట్‌లో కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ‘ఆపరేషన్ మధుసూదన్‌రెడ్డి’ తర్వాత ఇక్కడే తలదాచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిరునామా తన స్నేహితులు, బంధువులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. సిమ్‌కార్డులు, ఫోన్లు సైతం కొత్తగా ఖరీదు చేసి పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగాడు. బుధవారం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ‘పూజ’ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదునూ తీసుకుని దేవాలయాలకు తిప్పాడు. అప్పటికే ‘ఉమ్మెత్త మత్తు’లో ఉన్న మధుసూదన్‌రెడ్డి కుమారుడిని చేతులు కడుక్కోవాలంటూ బస చేసిన ఓరిస్ హోటల్‌లోని తన గదికి తీసుకువచ్చాడు.

 
‘ధ్యాన’మంటూ తాళాలు కాజేశాడు...

ఆ సమయంలో డబ్బుతో కూడిన సంచి మధుసూదన్‌రెడ్డి కుమారుడి కారు డిక్కీలో, కారు తాళం ఆయన దగ్గరే ఉంది. ఇక్కడా బురిడీ స్వామి తెలివిగానే వ్యవహరించాడు. డబ్బు రెట్టింపు కావడానికి ధ్యానం చేయాల్సి ఉందంటూ మధుసూదన్‌రెడ్డి కుమారుడికి చెప్పాడు. గదిలో ధ్యానంలో కూర్చునే ముందు నీ దగ్గర ఎలాంటి లోహపు వస్తువులూ ఉండకూడదు అంటూ చెప్పి కారు తాళాలతో సహా అన్నీ పక్కన పెట్టిం చాడు. ఆపై చాకచక్యంగా కారు తాళాలు తీసుకుని పార్కింగ్‌లోకి వెళ్లిన శివ... నగదు సంచిని తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చేసి తాళాలు యథాస్థానంలో ఉంచేశాడు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్‌రెడ్డి కుమారుడు ఇంటికి చేరుకునే వరకు డిక్కీలోని నగదు పోయిన విషయం గుర్తించలేదు.

 
ఏడేళ్లల్లో రూ.4.25 కోట్ల మోసాలు....

బురిడీ బాబా శివ 2009 నుంచి ఇప్పటి వరకు 10 ఉదంతాల్లో రూ.4.25 కోట్ల మేర స్వాహాలకు పాల్పడ్డాడు. మధుసూదన్‌రెడ్డి కేసుతో సహా రూ.2.05 కోట్లకు సంబంధించి బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టయ్యాడు. రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్‌లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ఈ ఘరానా నేరగాాడిపై రాజంపేట, నెల్లూరు, కుంబులుగుడ్డు, కేపీహెచ్‌పీ ఠాణాల్లో నాలుగు నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్‌బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నాయి. వెలుగులోకి రావాల్సిన మోసాలు మరిన్ని ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఈ అంశాలపై దృష్టి పెట్టనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement