పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బెంగాలీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.11.95 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్, చార్మినార్ ఇన్‌స్పెక్టర్లు ఎ.యాదగరి, కె.చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పాతబస్తీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్వాపరాలు వెల్లడించారు.
గౌస్ దందానే నకిలీ కరెన్సీ...
చంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొన్నేళ్ళుగా నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు.
కుటుంబీకులతో కలిసే మార్పిడి...
జైలుకు వెళ్ళి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అనేక సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలిసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కాలియా చౌక్ ప్రాంతానికి చెందిన బబ్లూ షేక్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం నడుస్తున్న గణేష్ ఉత్సవాలు, త్వరలో రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా ఉంటుందని, దీంతో నకిలీ కరెన్సీ తేలిగ్గా మార్చేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. బబ్లూను సంప్రదించిన గౌస్ రూ.12 లక్షల నకిలీ కరెన్సీ పంపాలని, మార్పిడి తర్వాత రూ.6 లక్షల అసలు కరెన్సీ పంపిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
బంధువులకు ఇచ్చి పంపిన బబ్లూ...
దీనికి అంగీకరించిన బబ్లూ రూ.1000, రూ.500 డినామినేషన్‌లో ఉన్న రూ.12 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి జహనారా బీబీ, బావమరిది షరీఫుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. వీరిద్దరికీ గౌస్ ఫోన్ నెంబర్ ఇచ్చి నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో ఇరువురూ శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించారు. అతడు చెప్పిన ప్రకారం చార్మినార్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, బి.మధుసూదన్, జి.మల్లేష్ తమ బందాలతో వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు. ప్రయాణం నేపథ్యంలో జహనారా బీబీ, షరీఫుల్‌లు రూ.5 వేలు ఖర్చు చేయగా... మిగిలిన రూ.11.95 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చార్మినార్ పోలీసులకు అప్పగించారు.