తొలి జన్మభూమిలోనే యూటర్న్
రుణ మాఫీపై చంద్రబాబు మరో మాట
హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: పంట రుణాలు అనో, లక్షన్నరలోపు రుణాలు మాత్రమేననో కాకుండా... వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ రుణాలన్నీ మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు వేసిన ఓట్లే ఆయన్ను సీఎంను చేశాయి. ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి రుణ మాఫీపై రకరకాల షరతులు పెడుతూ... చివరికి తొలివిడత ‘జన్మభూమి’లోనే అడ్డం తిరిగారు చంద్రబాబు. గురువారం విజయవాడలో మాట్లాడుతూ... ఏడాదికి 20 శాతం చొప్పున బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తామని, ఐదేళ్లలో రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తామని కుండ బద్దలుగొట్టేయటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వారు తమ రుణాల్ని ఏడాదిలోపు చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుంది.
ఏడాది దాటిపోయింది కనక ఏటా 14 శాతం వడ్డీని భరించాల్సిందే. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణాలు రూ.87వేల కోట్లు. డ్వాక్రా మహిళల రుణాలు మరో 14వేల కోట్లు. అంటే 1.01 లక్షల కోట్లు. దీనిపై ఏటా వడ్డీయే రూ.14 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఏడాదికి 20 శాతం చొప్పున అంటే... ఏటా 20వేల కోట్లు చెల్లించినా దాన్లో వడ్డీ పోను అసలు రూ.6వేల కోట్లు మించి ఉండదు. ఇలాగైతే తాము రుణ విముక్తులం కావటానికి 17 ఏళ్లకు పైనే పడుతుందన్నది రైతుల లెక్క. చంద్రబాబు ఏటా 20 శాతం చెల్లిస్తామని చెబుతున్నారు. ఇటీవల రుణవిముక్తి కమిటీ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తొలి ఏడాది రుణ మాఫీ కార్పొరేషన్‌కు రూ.7వేల కోట్లు కేటాయిస్తామన్నారు. అంటే అసలు కాదుకదా వడ్డీ కూడా సగమే చెల్లిస్తున్నట్టన్న మాట. ఇలాగైతే మాఫీ ఎప్పటికవుతుంది? ఆ లెక్కన ఐదేళ్లలో రైతుల్ని రుణ విముక్తుల్ని చేయాలంటే... రుణ మాఫీ పరిధిలోకి వచ్చే వారిని భారీగా తొలగించి, అతికొద్దిమందికే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణ బకాయిలు రూ.14వేల కోట్లు. వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు... ఇపుడు రూ.7600 కోట్ల మేర మాత్రమే డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని చెబుతున్నారు. మిగిలిన సగం రుణాల మాటేమిటి? రైతులు, డ్వాక్రా మహిళల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలన్నటికీ ప్రస్తుతానికైతే సమాధానాలు లేవు.