
వారసులొచ్చారు..
బంజారాహిల్స్ : గ్రేటర్ రాజకీయాల్లో ‘నవశకం’ అడుగు పెట్టింది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బరిలోకి దిగారు. తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దినవారు ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఎత్తుపల్లాలు చూసేందుకు సిద్ధమయ్యారు. పితామహులే వారికి తమ రాజకీయ అనుభవాన్ని పాఠంగా చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రధానమైన ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ముఖేష్ గౌడ్ తనయ..
అబిడ్స్ మాజీమంత్రి ముఖేష్‌గౌడ్ 1986లో మొదటిసారి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన మంత్రిగానూ సేవలందించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయన కూతురు శిల్ప ఇప్పుడు గన్‌ఫౌండ్రీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రేటర్ బరిలోకి దిగారు. తండ్రి ముఖేష్ తొలిసారి రాజకీయ జీవితం ప్రారంభించిన ఏడాదిలో జన్మించిన ఈమె ఎంబీఏ చదివారు. ఇక్కడ ఈమె స్వయానా పిన్ని, బీజేపీ అభ్యర్థి సరితాగౌడ్‌తో పోటీ పడుతుండంతో రాజకీయ ఆసక్తి నెలకొంది.
కేకే వారసత్వం..
శతృవులను కూడా మిత్రులుగా చేసుకొని ముందుకు సాగితేనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని తన తండ్రి రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు ఇచ్చిన సలహా పాటిస్తున్నానని బంజారాహిల్స్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి చెబుతున్నారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజంలో డిప్లొమా చేసిన ఈమె, తనకు తండ్రి రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. సొంత నిర్ణయాలనే అమలు చేస్తానని, ఇష్టం లేని సలహాలు తన తండ్రి ఇచ్చినా పాటించనన్నారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, వారి అభిప్రాయాలే పరిగణలోకి తీసుకుంటానన్నారు.
బరిలో పీజేఆర్ కుమార్తె..
హైదరాబాద్‌లో పీజేఆర్ పేరు వినని వారుండరు. ఆయన కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె పీజేఆర్ కూతురుగా సుపరిచితం. తండ్రి బాటలో నడవడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయనలాగే ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమవుతున్నారు విజయ. ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదివిన విజయారెడ్డి ఇప్పటికే రాజకీయ అనుభవం సంపాదించుకున్నారు. జనంతో మమేకమవుతూ సమస్యలను వింటూ పరిష్కార మార్గాలు చూపడంలో ఆమె పీజేఆర్‌ను అనుసరిస్తున్నారు.
‘బంగారు’ ఫ్యామిలీ నుంచి..
తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని, పెదనాన్న వారసురాలిగా బరిలోకి దిగినట్టు చెబుతున్నారు బంగారు స్రవంతి. వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈమె కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తమ్ముడు కూతురు. పెద్దనాన్న రాజకీయాలను దగ్గరి నుంచి చూసి స్పూర్తి పొందానని చెప్పారామె. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చేసి ఇటీవల సివిల్స్ రాశానని, ఐఏఎస్ కావాలన్న లక్ష్యం ఉందన్నారు. ప్రజాసేవకు ఐఏఎస్ కాని రాజకీయం కాని దగ్గరి దారులని పేర్కొన్నారు స్రవంతి.