
టీడీపీకి చావుదెబ్బ
♦ జీహెచ్‌ఎంసీలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం
♦ 45 స్థానాల నుంచి ఒక్క సీటుకు పరిమితం
♦ ఏమాత్రం ప్రభావం చూపని చంద్రబాబు, లోకేశ్ ప్రచారం
♦ బీజేపీ- టీడీపీ పొత్తు విఫలం..
♦ 2014లో గెలిచిన 9 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ దారుణ పరాభవం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బతిన్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో మాదే బలం అని గట్టిగా చెప్పుకొన్న ఆ పార్టీ... కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. మొత్తంగా 150 డివిజన్‌లలో బీజేపీతో పొత్తును కూడా పక్కనపెట్టి ఏకంగా 97 సీట్లలో పోటీ చేసినా... దాదాపుగా ఉనికినే కోల్పోయింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో మందడి శ్రీనివాస్‌రావు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. బీజేపీ పోటీ చేసిన 68 సీట్లలో మూడింట గెలిచి టీడీపీ కన్నా పైచేయి సాధించింది. టీడీపీ-బీజేపీ పొత్తులో ఎక్కువ బలాన్ని ఊహించుకుని బీజేపీకి కేటాయించిన సీట్లలో సైతం చివరి నిమిషంలో తెలుగుదేశం బీ-ఫారాలతో పో టీ చేసిన నేతలు తమతో పాటు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కూడా కారణమయ్యారు.
ఘోర పరాజయం..
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణవ్యాప్తంగా ఘోర పరాజయం పాలయింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో తొమ్మిదింటిని గెలుచుకుని ఉనికి చాటుకుంది. అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే... టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. టీడీపీలో కీలక నేతలుగా ఎదిగిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి తొలుత పార్టీని వీడగా... మాధవరం కృష్ణారావు, జి.సాయన్న వారిని అనుసరించారు.
ఎల్‌బీ నగర్ నుంచి గెలిచిన ఆర్.కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల పరిధిలో గతంలో గెలిచిన 45 మంది కార్పొరేటర్లలో సుమారు 35 మంది మాజీలు, పార్టీ ముఖ్య నాయకులు ఈసారి టీఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్‌లో టీడీపీ ఒకే సీటుకు పడిపోతుందని వారితోపాటు ఇతర పార్టీల నేతలు కూడా ఊహించకపోవడం గమనార్హం.
బాబు, లోకేశ్‌ల మాటలను నమ్మని సీమాంధ్రులు
2014 ఎన్నికల్లో టీడీపీ గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు సాధించినది సీమాంధ్రుల ఓట్ల కారణంగానే. ఈసారి కూడా ఆ ధీమాతోనే గ్రేటర్‌లో మెరుగైన సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు భావించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోకేశ్ దాదాపు ఐదు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయగా, చంద్రబాబు శివారు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు.
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపింది తానేనని, గ్రేటర్‌లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని, సీమాంధ్రులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పిన మాటలను వారు విశ్వసించలేదు. ఇక మంత్రి కె. తారకరామారావు ప్రచారం ముందు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రచారం వెలవెలబోయింది. చివరికి టీడీపీకి కంచుకోటలుగా భావించిన డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.
గ్రేటర్‌లో ‘దేశం’ మనుగడ ప్రశ్నార్థకమే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని, తీగల, మాధవరం కృష్ణారావు, సాయన్న ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రులు సి.కృష్ణయాదవ్ , కె.విజయరామారావులతో పాటు పలు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగినా... పార్టీ అధినేత ఇచ్చిన పలు హామీలతో ఆగిపోయారు.
ఇక తాజాగా గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో వీరందరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ మాజీ నేత వివేకానంద కూడా కారు ఎక్కుతారనే ప్రచారం జరుగుతోంది. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాజకీయాలను వీడి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే కార్యాచరణకు పిలుపిచ్చి కార్యరంగంలోకి దిగారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. మిగతా నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లోకే వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది.