మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం. చిత్రంలో చెరుపల్లి సీతారాములు, బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది.
ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్‌ఎస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్‌ఎస్ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment