
సృష్టిలో తండ్రి పాత్ర ప్రత్యేకమైంది
చిక్కడపల్లి: మన అభ్యున్నతి కోసం తోడ్పడేది తల్లిదండ్రులని, సృష్టిలో తండ్రి పాత్ర ప్రత్యేకమైనదని పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎన్.గోపి అన్నారు. అభినందన, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికలో గురువారం రాత్రి అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాదిరాజు శ్రీనివాసరావు (అభినందన భవాని నాన్న), గురజాడ భుజంగరావు (డాక్టర్ శోభాపేరిందేవి నాన్న) పురస్కారాలను చారిత్రక నవలాచక్రవర్తి ముదిగొండ శివప్రసాద్, ఆలిండియా రేడియో రిటైర్డ్ అదనపు డెరైక్టర్ జనరల్ డాక్టర్ అనంత పద్మనాభరావులకు ప్రదానం చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న గోపి మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పట్ల గాఢమైన ప్రేమకు ప్రతీకగా ఈ పురస్కారాలను అందజేస్తున్నామని, దీని వల్ల ఈ పురస్కారాలకు శోభపెరిగిందన్నారు. కార్యక్రమంలో దూరదర్శన్ కార్యక్రమం నిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశం, బైస దేవదాసు, పొత్తూరి సుబ్బారావు, కళాదీక్షితులు, అభినందన భవాని, శోభాపేరిందేవి, రమా, ఇందిర తదితరులు పాల్గొన్నారు.