ఇది ప్రాణదాత... నూరేళ్ల చరిత
ఫీవర్ ఆస్పత్రికి శత వసంతాలు రేపు వేడుకలు
సిటీబ్యూరో/నల్లకుంట: అధికమెట్ట ఒక అడవి. కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు,రప్పలు... జనసంచారం అంతగా లేని ఆ ప్రాంతంలో పశువుల కాపరులు మాత్రమే కనిపించేవారు. అలాంటి అడవిలో విషాదం చోటుచేసుకుంది. ఏ చెట్టు కింద చూసినా జీవచ్ఛవాలులా కొట్టుమిట్టాతున్న మనుషులే. మహమ్మారి ప్లేగు బారి నుంచి ఊరిని కాపాడుకొనేందుకు వ్యాధిగ్రస్తులను అలా అడవిలో ఉంచి చికిత్స ప్రారంభించారు వైద్యులు. ప్లేగు ప్రబలిన ప్రతిసారీ అధికమెట్ట రోగులతో నిండిపోయేది. బతికితే ఇంటికి. లేదంటే ఆ అడవిలోనే పూడ్చిపెట్టేవాళ్లు. ఆ ‘అధికమెట్టే’ ఇప్పుడు ‘అడిక్‌మెట్’. అటు ఈసీఐఎల్ వరకు, ఇటు నల్లకుంట, కాచిగూడ, అంబర్‌పేట్, రామంతాపూర్ వరకు చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలతో అధికమెట్ట ఉండేది. ఒకవైపు పరవళ్లు తొక్కే మూసీనది. మరోవైపు పచ్చటి అడవి. ప్లేగు వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్న ఆ అడవిలోనే తదనంతర కాలంలో చరిత్రాత్మక ఆస్పత్రి నిర్మాణానికి పునాది వేశాడు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ‘కోరంటి దవాఖాన’గా,‘ ఫీవర్ ఆస్పత్రి’గా పేరొందిన ఈ వైద్య శాల వందేళ్ల వేడుకను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే...
మూసీ ఒడ్డునే ఆస్పత్రి
జనరంజక పరిపాలన సాగించిన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోనే ప్రజలు ఒకవైపు సంతోషాన్ని... మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో విషాదాన్ని అనుభవించారు. మూసీ ఉప్పొంగి అనేక మందిని పొట్టన పెట్టుకొంది. అంటువ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోయారు. అలాంటి గడ్డు రోజుల్లో మూసీ పరీరక్షణ, ప్రజారోగ్యం రెండూ సవాల్‌గా నిలిచాయి. మూసీ మరోసారి ఉప్పొంగకుండా దానికి రెండువైపులా పటిష్టమైన నిర్మాణాలు, అడవులు ఉండాలని గుర్తించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆస్పత్రుల నిర్మాణంతో రోగులకు త్వరగా స్వస్థత లభించగలదని భావించారు. ఉస్మానియా ఆస్పత్రికీఅలాగే బీజం పడింది. ఆరో నిజాం కాలంలో ప్రారంభమైన ఈ పనులను ఏడో నవాబు ఉస్మాన్ అలీఖాన్ పూర్తి చేశారు. అలా మూసీ ఒడ్డున అధికమెట్ట అటవీ ప్రాంతంలో వీరన్నగుట్ట దగ్గర అంటువ్యాధులకు వైద్య సేవలందించే ఒక చిన్న ఆస్పత్రి 1915 ఆగస్టు 20న ఆవిర్భవించింది. 1920 నాటికి దీన్నినల్లకుంటకు తరలించి పక్కా భవనాలు కట్టించారు. అదే ఇప్పటి ఫీవర్ ఆస్పత్రి. మొదట ప్లేగు, కలరా, డయేరియా వంటి వ్యాధులకు వైద్య సేవలందించారు.క్రమంగా మలేరియా, డెంగీ, ధనుర్వాతం, చికెన్‌గున్యా, గవదబిళ్లలు, తట్టు, పొంగు, కుక్కకాటు, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులకు వైద్య సేవలు విస్తరించాయి.
‘క్వారెంటైన్’ నుంచి సర్ రోనాల్డ్ రాస్ ఆస్పత్రిగా...
అంటువ్యాధులతో బాధ పడే వారిని ఊరికి దూరంగా ఉంచి వైద్యం అందించే పద్ధతి ‘క్వారెంటైన్’. అలా క్వారంటైన్ ఆస్పత్రిగా ఏర్పడి... క్రమంగా జనం వాడుకలో ‘కోరంటి దవాఖాన’గా పేరొందింది. తెలంగాణలోని అన్ని జిల్లాల రోగులు ఇక్కడకు వచ్చేవారు. మరోవైపు బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రాంతమైన సికింద్రాబాద్‌లో సైనికులు ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టి మలేరియా బారిన పడుతున్నట్లు గుర్తించిన సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలు సైనికులకే కాకుండా తెలంగాణలో మలేరియా నిర్మూలనకు తోడ్పడ్డాయి. మలేరియాను అంతమొందించడంలో ఆయన కృషికి గుర్తుగా 1997లో ఈ ఆస్పత్రికి ‘సర్ రోనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్’గా నామకరణం చేశారు.
అభివృద్ధి పథంలో..
1960లో ఇక్కడ వైరల్ జ్వరాల పరిశోధన కేంద్రం ప్రారంభమైంది.మొత్తం 330 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 50 మంది ఇన్‌పేషెంట్‌లుగా, 600 మంది అవుట్‌పేషేంట్‌లుగా చికిత్స పొందుతున్నారు.అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 జూన్ 4న ఈ ఆస్పత్రికి ‘బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఏపీ ఇన్ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ’అవార్డును అందించారు. రోగుల వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఎప్పటికప్పుడు చికిత్సలను రికార్డు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఘనంగా వేడుకలు
ఈ నెల 21నఫీవర్ ఆస్పత్రి వందేళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సూపరెంటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆస్పత్రిలో చాలాకాలం సేవలందించిన పలువురు వైద్యులు, వివిధ విభాగాల ప్రముఖులను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా సావనీర్ విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.