ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం | fight will be on public issues | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం

Published Sat, Mar 19 2016 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం

కలిసి వచ్చే శక్తులను కలుపుకొని వెళ్తాం: కోదండరాం
♦ ప్రభుత్వ పనితీరును గమనిస్తాం
♦ తెలంగాణ వచ్చాక జేఏసీ అక్కర్లేదనడం సరికాదు
♦ ఉద్యోగ జేఏసీ ఎందుకు బయటకు వెళ్లిందో తెలియదు
♦ వచ్చేవారం స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సమస్యలపై టీజేఏసీ పోరాటం కొనసాగుతుంది. రాష్ట్రం కోసమే ఏర్పాటైన జేఏసీ.. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకంటున్నారు. ఇది సరైనది కాదు. ప్రత్యేక రాష్ట్రం రాగానే బాధ్యత తీరిపోదన్నది నా అభిప్రాయం. ప్రభుత్వ పనితీరును గమనిస్తూ.. ప్రజా సమస్యలపై అధ్యయనం చేయడం, పోరాడడం జేఏసీ బాధ్యత..’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. టీజేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అంతకుముందు అందుబాటులో ఉన్న జేఏసీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చేవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, అందులో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. జేఏసీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా కొత్తగా కలిసి వచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కరువు అధ్యయనం కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, జిల్లాల వారీగా జేఏసీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

 ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు
 జేఏసీ నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ ఎందుకు బయటకు వెళ్లిపోయిందో తనకు తెలియదని, వారిపై ఎలాంటి నిందలు వేయమని కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సర్వీసు రూల్స్ అడ్డు వస్తున్నాయోమోనని వ్యాఖ్యానించారు. టీజేఏసీ రాష్ట్ర సాధన ఉద్యమానికే పరిమితం కాదని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రజలకు మాటిచ్చినట్లు గుర్తుచేశారు. ‘‘ఉద్యమమే పరిష్కారం చూపుతుందని భావించాం. ఇప్పటికీ అదే విశ్వాసంతో ఉన్నాం. పౌరులుగా, పౌర వేదికగా స్పందించాల్సి ఉంటుంది. జేఏసీ మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు, దృక్పథాలున్నాయి. వాటి అమలు కోసం కార్యాచరణ కొనసాగుతుంది’’ అని అన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీకి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎపుడూ చెబుతుండే వారని, ఆయన సూచన మేరకు పనిచే స్తామన్నారు. సమస్యలపై అధ్యయనం చేస్తాం, పరిష్కారాలు తెలుసుకుంటాం, ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించుకున్న మేరకు బడ్జెట్‌పై చర్చిస్తామని, కరువు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తామని పేర్కొన్నారు. తమది రాజకీయ పార్టీలతో ఉన్న సంఘం కాదని, ప్రజా సంఘంగానే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు వేతన బకాయిలు అందలేదని, హెల్త్ కార్డులు, ఉద్యోగుల విభజన వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వారి పోరాటాల్లో కచ్చితంగా ఉద్యోగుల వెంట ఉంటామని ప్రకటించారు.

 సెక్షన్-8పై ఏపీ తీర్మానం హాస్యాస్పదం
 సెక్షన్-8పై ఏపీ అసెంబ్లీ తీర్మాణం చేయడం హాస్యాస్పదమని కోదండరాం అన్నారు. అసెంబ్లీ అంటే తమకు గౌరవం ఉందని, అయితే సుషుప్తావస్థలో ఉన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు, ప్రజల స్వేచ్ఛ, ఆస్తులకు భంగం కలిగినప్పుడే సెక్షన్-8 అవసరం అవుతుందన్నారు. అవగాహన లే కుండా తీర్మానం చేశారని చెప్పారు. ఒక రాష్ట్రంపై ఇంకో రాష్ట్రం ఆధిపత్యం కోరడం కరెక్టు కాదని, రాజ్యాంగానికి వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు ప్రహల్లాద్, రఘు, వెంక ట్‌రెడ్డి, పిట్టల రవీందర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 జేఏసీ నుంచి మరో రెండు సంఘాలు బయటకు..
 తెలంగాణ జేఏసీ నుంచి మరో రెండు సంఘాలు బయటకు వచ్చాయి. టీజేఏసీ నుంచి బయటకు వచ్చినట్లు తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) శుక్రవారం ప్రకటించాయి. టీజేఏసీ ఏర్పాటు లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్ర సాధన నెరవేరినందున తాము వైదొలుగుతున్నట్లు అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ప్రత్యేక హైకోర్టు సాధన కోసం పోరాడుతామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement