
కీలక అధికారిని ఇంటికి పంపితేనే అంతా దారిలోకి
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణదారులకు జారీ చేసిన నోటీసులు చాలా అస్పష్టంగా ఉన్నాయని, దీనిని బట్టి అధికారులు తమ ఉత్తర్వులను చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే జీహెచ్‌ఎంసీలో కీలక అధికారిని ఒకరిని ఇంటికి సాగనంపితే, మిగిలినవారు దారిలోకి వస్తారంది.
నోటీసుల్లో కోర్టు ఆదేశాల మేరకు జారీ చేసినట్లు పేర్కొనడంపై హైకోర్టు నిలదీసింది. ‘మేం చెబితే గానీ మీరు ఏ పనీ చేయరా..? ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని కూడా మేమే చెప్పాలా..? మేం చెబితే మీరు చేయడమేంటి..? మీ పని మేం చేయాలా..? మేం చెబితేనే మీరు నెల నెలా జీతాలు తీసుకుంటున్నారా..? మరి వాటిని మమ్మల్ని అడిగి చేయనప్పుడు, ఆక్రమణదారులపై చర్యలు కూడా మీరంతట మీరే తీసుకోవాలి కదా.!’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
తదుపరి విచారణను 29కి వాయిదా
ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీకి మరో అవకాశమిస్తూ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సిద్దంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. దీనికి స్వయంగా హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంచార్జ్ డిప్యూటీ కమిషనర్ కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే ఆక్రమణదారులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు జారీ చేశామంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు.
వాటిని పరిశీలించిన ధర్మాసనం, అందులో ఆ నోటీసులను ఎప్పుడు జారీ చేశారు..? వాటిని ఆక్రమణదారు ఎప్పుడు అందుకున్నారు..? వారు ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలి..? స్పందించపోతే ఏం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది..? తదితర వివరాలు లేకపోవడాన్ని ప్రశ్నించింది. ‘జీహెచ్‌ఎంసీ అధికారులు చాలా తెలివిగా నోటీసులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఆక్రమణదారులకు సాయం చేసేందుకే ఇలా అస్పష్టంగా ఇచ్చినట్లుంది.
ఇవి ఏ మాత్రం సంతృప్తికరంగా లేవు. అసలు వీటిని నోటీసులంటారా..? కోర్టు ఉత్తర్వులను అధికారులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు ఈ నోటీసులను పరిశీలించిన తరువాత అర్థమవుతోంది. హైకోర్టు ఉత్తర్వులంటే మీకు లెక్క లేదా..? ఇందుకు కిందిస్థాయి సిబ్బందిని బలి పశువుని చేయడం తగదు. జీహెచ్‌ఎంసీలో కీలక స్థాయిలో ఉన్న అధికారిని ఇంటికి సాగనంపితే, మిగిలిన వారంతా దార్లోకి వస్తారు. ఇటువంటి నోటీసులు జారీ చేసినందుకు ఈ అధికారి (కోర్టు ముందు హాజరైన డిప్యూటీ కమిషనర్)పై చర్యలు తీసుకోమంటారా..?’ అని నిలదీసింది.
ఇదే సమయంలో ఓ వ్యాపారి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమ షాపు ముందు ఉన్న స్థలం తమ సొంతదని, దానిని జీహెచ్‌ఎంసీ వారిదిగా పేర్కొంటూ అక్కడున్న నిర్మాణాన్ని తొలగించిందని తెలి పారు. దీనిపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోబోమని, నోటీసులు అందుకున్న వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై ఎటువంటి సామాగ్రిని ఉంచబోమంటూ రాతపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.