ఇటువైపు చూడని విదేశీ విద్యార్థులు
ఆకర్షించలేకపోతున్న తెలంగాణ విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక విద్యా సంస్థలు కలిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు విదేశీ విద్యార్థులను మాత్రం ఆకర్షించలేకపోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలు ఇందులో ముందుండగా...తెలుగు రాష్ట్రాలు చివ రి స్థానాల్లో నిలిచిపోయాయి. మరోవైపు ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో చదివేందుకు ఇతర దేశాలవారు ఆసక్తి చూపడం లేదు. దేశంలో వర్సిటీలు, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి 800కు పైగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా విదేశీ విద్యార్థులను రాబట్టలేకపోతున్నాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల వైపు మొగ్గు...
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 3.32 కోట్ల సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో 10% సీట్లలో విదేశీయులను చేర్చుకునే వీలుంది. ఈ లెక్కన 30 లక్షల మందికి అవకాశం ఉంది. అయితే భారత్‌లోని వర్సిటీల పరిధిలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 31,126 మాత్రమే. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లోని విద్యా సంస్థల్లోనే చదువుతున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియన్ వర్సిటీలు సంయుక్తంగా రూపొందించిన ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా-2015 నివేదిక స్పష్టం చేస్తోంది. తెలంగాణలో దాదాపు 16 లక్షల సీట్లు ఉన్నత విద్యలో ఉండగా, ఒక్క శాతం కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షించలేకపోతోంది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి.
తెలంగాణలో 5.45 శాతం...
మొత్తం 31,126 మంది విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా 7,750 మంది (24.90 శాతం) మహారాష్ట్రలో... 7,290 మంది (23.42 శాతం) ఢిల్లీలో... 4,877 మంది (15.67 శాతం) కర్ణాటకలో చదువుతున్నారు. తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (3,548), పంజాబ్ (1,964) ఉన్నాయి. తెలంగాణలో 1,696 మంది (5.45 శాతం) విద్యార్థులు చదువుతున్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలోని విదేశీ విద్యార్థుల్లో ఎక్కువమంది (23,350) ఆసియా దేశాలకు చెందిన వారు కాగా, 5,799 మంది ఆఫ్రికా వారున్నారు. అమెరికా విద్యార్థుల సంఖ్య కేవలం 457 మాత్రమే!