థానే జాయింట్ సీపీగా లక్ష్మీనారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ హైదరాబాద్ విభాగం జాయింట్ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిలీవ్ అయిన లక్ష్మీనారాయణను మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్ అధికారి. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన డిప్యుటేషన్‌పై సీబీఐలో హైదరాబాద్ జాయింట్ డెరైక్టర్‌గా వచ్చారు. ఇక్కడ పనిచేసిన కాలంలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణంతో పాటు పలు కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు.
లక్ష్మీనారాయణకు ఐజీగా పదోన్నతి లభించడంతో గత జూన్‌లో ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. దీంతోపాటు కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్ గడువు ముగియడంతో.. ఆయన మహారాష్ట్ర పోలీసు శాఖకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న లక్ష్మీనారాయణను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా థానే జాయింట్ సీపీగా నియమించింది.