Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రిలో వినోద్‌ కాంబ్లీ! | Vinod Kambli Faces Health Issue Admitted To Hospital In Critical Condition | Sakshi
Sakshi News home page

Vinod Kambli: క్షీణించిన ఆరోగ్యం.. ఆస్పత్రిలో వినోద్‌ కాంబ్లీ.. పరిస్థితి విషమంగా ఉందా?

Published Mon, Dec 23 2024 4:44 PM | Last Updated on Mon, Dec 23 2024 5:03 PM

Vinod Kambli Faces Health Issue Admitted To Hospital In Critical Condition

ఆస్పత్రిలో చేరిన వినోద్‌ కాంబ్లీ(PC: IANS X)

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆస్పత్రి పాలయ్యాడు. తీవ్రమైన అనారోగ్యంతో శనివారం రాత్రి థానెలోని ఓ హాస్పిటల్‌లో చేరాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ IANS అందించిన వివరాల ప్రకారం.. క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.

ఈ నేపథ్యంలో ఆయనను శనివారం రాత్రి థానెలో గల ఆకృతి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు IANS ఎక్స్‌ ఖాతాలో వివరాలను పోస్ట్‌ చేసింది.

కాగా ముంబైకి చెందిన వినోద్‌ కాంబ్లీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కులర్‌కు చిన్ననాటి స్నేహితుడు. ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ ఆచ్రేకర్‌ వద్ద ఓనమాలు నేర్చుకున్న వీళ్లిద్దరు అద్భుతమైన నైపుణ్యాలు కలవాళ్లే. 

చెడు వ్యసనాల వల్లే?
అయితే, సచిన్‌ ఆటలో శిఖర స్థాయికి చేరుకోగా.. కాంబ్లీ మాత్రం పాతాళానికి పడిపోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం, చెడు అలవాట్ల వల్లనే అతడికి ఈ పరిస్థితి ఎదురైందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. గతంలో కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్‌ ఆచ్రేకర్‌ 92వ జయంతి సందర్భంగా సచిన్‌ టెండుల్కర్‌తో కలిసి ముంబైలో వేదిక పంచుకున్న సమయంలో.. కాంబ్లీ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది.

సాయం తీసుకుంటా.. చెప్పినట్లు వింటా
ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని 1983 వరల్డ్‌కప్‌ విజేత జట్టులోని సభ్యులు.. కాంబ్లీకి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే, అతడు రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటేనే సహాయం అందిస్తామని షరతు విధించారు. ఇందుకు అంగీకరించిన వినోద్‌ కాంబ్లీ.. తాను మద్యం, పొగతాగడం మానేశానని.. చికిత్స తీసుకుంటానని స్పష్టం చేశాడు.

అయితే, తాజా సమాచారం ప్రకారం వినోద్‌ కాంబ్లీ మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. కాగా భారత్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో వినోద్‌ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 

తన తొమ్మిదేళ్ల ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 రన్స్‌ చేశాడు. అంతేకాదు.. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసం.. తిలక్‌ వర్మకు చేదు అనుభవం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement