రేపటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు | From tomorrow to MBBS and BDS web options | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు

Published Thu, Jul 27 2017 3:31 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

రేపటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు - Sakshi

రేపటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్‌ వెబ్‌ ఆప్షన్లు

ఈ నెల 30 వరకు గడువు
- ‘ఏ’ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌
ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకునే వెసులుబాటు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ‘ఏ’కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య సీట్ల భర్తీ కోసం జూలై 28 ఉదయం 8 గంటల నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానుంది. జూలై 30 సాయంత్రం 4 గంటలకు ఈ ప్రక్రియ ముగియనుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వైస్‌ చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి తుది మెరిట్‌ జాబితాను విశ్వవిద్యాలయం రూపొందించింది. తుది మెరిట్‌ జాబితాను జూలై 28న విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు  http:// tsmedadm.tsche.in వెబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 28 నుంచి 30 లోపే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ ‘ఏ’కేటగిరీ సీట్ల విషయంలో కాలేజీ సంఖ్య ఆధారంగా అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లు అయినా ఇవ్వొచ్చు.
 
► అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో కాలేజీల ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు ఎంచుకున్న కాలేజీలో సీటు వచ్చి జాయిన్‌ కాకుంటే... తరువాత కౌన్సెలింగ్‌లకు అనుమతించరు. 
► ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు రూ.10 వేల చొప్పున యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లోనే ఈ ఫీజును చెల్లించాలి. సీట్‌ మ్యాట్రిక్స్‌ పద్ధతి వివరాలను జూలై 27న విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.
► అభ్యర్థులు ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరల్‌ వెర్షన్‌–10లోనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో అభ్యర్థులు నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది.
► వెబ్‌ ఆప్షన్లు నమోదు చేశాక ప్రింట్‌ తీసుకోవాలి. వెబ్‌ ఆప్షన్‌లో సీటు దక్కిన అభ్యర్థుల మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆ తర్వాత సీటు కేటాయింపునకు సంబంధించిన ప్రింట్‌ తీసుకోవాలి.
► సీటు పొందిన అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను, ఫీజు చెల్లింపు వివరాలను గడువులోపు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్‌కు అందజేయాలి. కోర్సును మధ్యలో వదిలేసిన అభ్యర్థులకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వరు. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
► వెబ్‌ ఆప్షన్ల విషయంలో అభ్యర్థులకు సహాయంగా ఉండేందుకు జేఎన్‌టీయూ, పీజీఆర్‌ఆర్‌సీడీఈ–ఓయూ (హైదరాబాద్‌), కాకతీయ విశ్వవిద్యాలయం (వరంగల్‌)లో జూలై 28 నుంచి 30 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను కాళోజీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement