భూసేకరణ చట్టం ద్వారానే సేకరించండి
ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణపై లోకాయుక్త ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని... 2013 భూసేకరణ చట్టం ద్వారా మాత్రమే సేకరించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సెప్టెంబరు 13లోగా నివేదిక సమర్పించాలని ఇటీవల వీరికి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రైతుల నుంచి రెవెన్యూ అధికారులు జీవో 123 కింద బలవంతంగా భూములను సేకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ దాఖలు చేసిన పిటిషన్లను లోకాయుక్త ఇటీవల విచారించారు.
ఇష్టపూర్వకంగా ఇచ్చే రైతుల నుంచే తాము భూములు కొనుగోలు చేస్తామంటూ జీవో 123 తెచ్చారని, అయితే ఈ జీవోను అడ్డుపెట్టుకొని రెవెన్యూ అధికారులు బలవంతంగా, రైతులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి భూమిని కొనుగోలు చేస్తున్నారని పద్మ తెలిపారు. ఖాళీ బాండ్ పేపర్లపై రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. 2013 చట్టం కన్నా తామే ఎక్కువ పరిహారం ఇస్తున్నామని, భూములు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చేసే ముందు ప్రత్యేకంగా మార్కెట్ విలువను పెంచాలని చట్టం చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు స్పందించిన లోకాయుక్త... భూమిని విక్రయించాలంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని, 2013 భూసేకరణ చట్టం ద్వారా మాత్రమే భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు.