ముంపు భూముల్ని సేకరించి పరిహారం ఇవ్వండి | High court Mandate to Telangana government | Sakshi
Sakshi News home page

ముంపు భూముల్ని సేకరించి పరిహారం ఇవ్వండి

Published Sun, Dec 2 2018 3:25 AM | Last Updated on Sun, Dec 2 2018 3:25 AM

High court Mandate to Telangana government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెరువులు తవ్వినప్పుడు భూములు ముంపునకు గురైతే భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువు తవ్వడం వల్ల తరచూ భూములు ముంపునకు గురవుతుంటే ఆ భూముల్ని ప్రభుత్వం సేకరించి రైతులకు చట్ట ప్రకారం పరిహారం ఇవ్వా లని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు ఇటీవల తీర్పు చెప్పారు. పదేపదే ముంపునకు గురయ్యే భూములకు ఒకసారి పరిహారం ఇచ్చేసి తాము సాయం చేశామని ప్రభుత్వం చెప్పడం న్యాయబద్ధం కాదని తేల్చి చెప్పారు. పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లా వీపనగండ్ల మండలం బెక్కన గ్రామంలో బెక్కం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ నిర్మాణం కారణంగా పలువురు రైతులు జరిపిన న్యాయపోరాటం 14 ఏళ్లకు ఫలించింది. ఆ ప్రాంతంలోని 36 గ్రామాలకు తాగునీటితోపాటు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెరువు విస్తీర్ణాన్ని పెంచారు.

2002లో జూరాల ప్రాజెక్టు పూర్తవ్వడంతో దాని నుంచి 30కిపైగా తూముల ద్వారా బెక్కం చెరువును నీటితో నింపడం ప్రారంభించారు. దీనివల్ల 111 ఎకరాల భూములు ముం పునకు గురవుతున్నాయని 56 మంది రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు వారి వినతులను ఖాతరు చేయకపోవడంతో 2004లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖ లు చేశారు. హైకోర్టు నియమించిన అడ్వకేట్‌ కమిషన్‌ కూడా భూముల ముంపు వాస్తవమేనని తేల్చింది. భూముల ముంపుపై సంబంధిత సివిల్‌ కోర్టు నుంచి రైతులు పరిహారం పొందవచ్చునని కమిషన్‌ నివేదికలో పేర్కొంది. నీటిపారుదల శాఖ ఆ నివేదికపై అభ్యంతరం చెప్పింది. రెవెన్యూ శాఖ రైతులకు నష్ట పరిహారం ఇచ్చిందని తెలిపింది.

వీటన్నింటినీ లోతుగా పరిశీలించిన న్యాయమూర్తి.. ‘పంట నష్టపోయినప్పుడు ఒకసారి పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేశామని ప్రభుత్వం వాదించడం చట్ట వ్యతిరేకం. ఆ ముంపు భూముల్ని ప్ర భుత్వం సేకరించడం తప్ప వేరే మార్గం లేదు. నష్టపోయిన వివిధ సర్వే నంబర్లల్లోని రైతులకు 2013–భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సిందే. దీంతోపాటుగా హైకోర్టును ఆశ్రయించిన రైతులకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చులుగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement