అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తలకే అందు తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ ఒక బూటకంగా మారిందన్నారు.
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన యాలాల పరశురాం, మహంకాళి శ్రీనివాస్ అనే ఇద్దరు దళిత యువకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో, సర్కారు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకుల ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.