![26 నెలల పాలనలో 16 సార్లు మొట్టికాయలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51470338979_625x300.jpg.webp?itok=iIVCs2bq)
26 నెలల పాలనలో 16 సార్లు మొట్టికాయలు
* టీఆర్‌ఎస్‌పై వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఫైర్
* జీవో 123ని కొట్టివేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శ
* అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ 26 నెలల పాలనలో హైకోర్టు 16 సార్లు మొట్టికాయలు వేసిందని.. ఆయా జీవోలు, నిర్ణయాలను తప్పుబట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది టీఆర్‌ఎస్ సర్కారుకు సిగ్గుచేటని పేర్కొన్నారు. జీవో 123ను కొట్టివేయడంపై అప్పీలుకు వెళతామనడం ఎందుకని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల కోసం రైతులు, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే రైతుల కడుపు నింపేలా ఉండాలే తప్ప కడుపు కొట్టేలా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తమ తీర్పుల ద్వారా ఒకరకంగా ప్రభుత్వాన్ని అభిశంసించే తీరులో వ్యాఖ్యానాలు చేసినా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదని విమర్శించారు.
భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా ఇతర మార్గాల్లో భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందన్నారు. అవసరమైతే ఎంత స్థాయి వరకైనా పోరాడుతామని చెప్పారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందని.. కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పోవడం సరికాదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు లాఠీలు, తూటాలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదేదారిలో సాగుతోందని విమర్శించారు.
26 నెలల్లో ఒక్క ప్రాజెక్టు చేపట్టారా?
గత 26 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి, అదనంగా ఒక్క టీఎంసీ నీటినైనా పొలాలకు పారించారా అని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు నీళ్లు వస్తున్న విషయం గ్రహించాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. ‘ప్రతి చెయ్యికి పని, ప్రతి చేనుకు నీరు’ అనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి జరిపిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు.