ఎన్నో చెబుతారు...కొన్నే చేస్తారు
► కేటాయింపులకూ...పనులకూ
► పొంతన లేని వైనం జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో పొందుపరిచే పనులకు... వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ఏడాదిలో ఎన్నో పనులు చేయనున్నట్లు బడ్జెట్‌లో చెబుతున్నా.. అవి అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం మొద ట్లో ప్రతిపాదించిన పనులను అక్టోబర్‌లో రివైజ్డ్ బడ్జెట్ రూపొందించే నాటికే కుదిస్తున్నారు. నిధులు లేకపోవడం ఒక కారణమైతే.. తగినంత మంది అధికారులు లేకపోవడం మరో కారణం. రివైజ్డ్ బడ్జెట్‌లో తగ్గించిన మేరకైనా పనులు చేయగలరో లేదో రానున్న 40 రోజు ల్లో తేలనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో చేయాలనుకున్న పనులు..
ఇప్పటి వరకు చేసినవి పరిశీలిస్తే..
♦ రూ.700 కోట్లతో రహదారుల పనులు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీన్ని అక్టోబర్ రివైజ్డ్ బడ్జెట్‌లో రూ.605 కోట్లకు కుదించారు. ఇవి ఎంతమేర పూర్తి చేయగలరన్నది నెల రోజులు గడిస్తే కానీ తెలియదు.
♦ పేద బస్తీల ప్రజలకు శుద్ధ జలం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. రివైజ్డ్‌లో రూ.25 కోట్లకు తగ్గించా రు. రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు.
♦ స్లాటర్‌హౌస్‌ల ఆధునీకరణకు రూ.40 కోట్లు కేటాయించినా.. వాస్తవ పరస్థితుల్ని అంచనా వేసి రూ.15 కోట్లకు తగ్గించారు.
♦ స్లమ్‌ఫ్రీ కోసం రూ.450 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.250 కోట్లకు తగ్గించారు.
♦ మల్టీపర్పస్ హాళ్లకు రూ.106 కోట్లు కేటాయించినా.. పనులు జరగలేదు.
♦ ఆధునిక మార్కెట్లదీ అదే దారి. తొలుత రూ. 70 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.50 కోట్లకు త గ్గించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.
♦ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు కేటాయించి.. రూ. 9 కోట్లకు తగ్గించారు. ఇంతవరకు ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవు.
♦ మహిళల టాయ్‌లెట్లకు బడ్జెట్‌లో రూ.10 కోట్లు చూపారు. ఎక్కడా ఏర్పాటు కాలేదు. రివైజ్డ్‌లో రూ.7.31 కోట్లకు తగ్గించారు.
♦ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల బలోపేతానికి బడ్జెట్‌లో రూ.12 కోట్లు కేటాయించి...రూ. 3.24 కోట్లకు కుదించారు.
♦ సీనియర్ సిటిజన్ల ఆసరా కార్యక్రమాలకు తొలుత రూ.10 కోట్లు కేటాయించి, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా తిరిగి రూ. 2.04 కోట్లకు తగ్గించారు.
♦ ఇలా అంచనాల్లో మాత్రం భారీ సంఖ్యలు ఉన్నప్పటికీ, వాస్తవంలో కనిపించడం లేదు. అక్టోబర్‌లో నిధులు తగ్గించి రివైజ్ చేసినప్పటికీ... అనంతరం వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్, ఇతరత్రా కారణాలతో పనులు కదల్లేదు.