మొబైల్స్.. టీమ్స్.. స్క్వాడ్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ఘట్టం సజావుగా సాగేందుకు పోలీసు విభాగం అనేక చర్యలు తీసుకుంటుంది. వీటిలో భాగంగా మొబైల్స్, టీమ్స్, స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తుంటుంది. ఎలక్షన్ సీజన్‌లో తరచూ వినిపించే ఆయా బృందాల విధులేమిటో చూద్దాం..
పోలింగ్ స్టేషన్: ఓటర్లు ఓటు వేసే ఎలక్షన్ బూత్‌లు ఉండే ప్రాంతం
పోలింగ్ సెంటర్: ఒకటి లేదా కొన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్న భవనం లేదా ప్రాంగణం
రూట్: డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సెంటర్ మధ్య ఉన్న మార్గాన్ని రూట్‌గా పరిగణిస్తారు. ఒక రూట్‌లో కొన్ని పోలింగ్ సెంటర్లు ఉంటాయి.
రూట్ మొబైల్: ఈవీఎంలతో సహా ఎన్నికల సామగ్రిని రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి, తిరిగి కౌంటింగ్ సెంటర్‌కు తీసుకురావడానికి ఇది భద్రత కల్పిస్తుంది.
స్ట్రైకింగ్ ఫోర్స్: ప్రతి డివిజన్‌కు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. సాధారణ బందోబస్తు, భద్రతా విధులతో పాటు అత్యవసర సమయాల్లోనూ స్పందనకు దీన్ని వినియోగిస్తారు.
స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్: ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటికి మించి డివిజన్లు ఉండొచ్చు. ఇలా పీఎస్ పరిధికి సంబంధించి దీన్ని ఏర్పాటు చేస్తారు. స్ట్రైకింగ్ ఫోర్స్ విధులే నిర్వర్తిస్తుంది.
ఫ్లయింగ్ స్వ్కాడ్: సర్కిల్‌కు ఒకటి చొప్పున ఉండే ఈ బృందాల్లో పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఆ సర్కిల్ పరిధిలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చేయడానికి నిరంతరం సంచరిస్తూ తనిఖీలు చేస్తుంది.
స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్: సర్కిల్‌కు ఒకటి చొప్పున ఉండే ఇందులోనూ పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, మద్యం, నగదు, బంగారం తరలింపు, అనుమతి లేని సమావేశాల నిర్వహణ తదితరాలపై కన్నేసి ఉంచి చర్యలు తీసుకుంటుంది.
చెక్‌పోస్టు: జిల్లా, నియోజకవర్గం, డివిజన్ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తారు. వాహనాల తనిఖీ, నిఘా ప్రధాన విధులు.
పికెట్: ఆయా డివిజన్ల పరిధిలోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే వరకు నిరంతర నిఘా కోసం ఇవి పనిచేస్తాయి.